BRS Party( IMAGE credit: twiter)
Politics

BRS Party: కారును పోలిన గుర్తులు తొలగింపుపై ఈసీపై ఒత్తిడి

BRS Party: గులాబీ పార్టీకి గుర్తుల భయం పట్టుకుంది. కారును పోలిన గుర్తులతో తీవ్రనష్టం జరుగుతుందని భావించి ముందుగానే అలర్ట్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గుర్తులు ఉండొద్దని కొత్త రాగం అందుకున్నది. ఇప్పటికే పార్టీ క్యాడర్ నైరాశ్యంలో ఉండడంతో స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటకపోతే మరింత నైరాశ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నది. అందుకే ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులకు శ్రీకారం చుట్టింది.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై పోరాటం
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంత ముఖ్యమో వారి పార్టీ బలం సింబల్ అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా కారు పార్టీనేతలు గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

 Also Read: Water Disputes: తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలి..

దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్నికల కమిషన్‌కు, అటు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీలకు ఎన్నికల్లో గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లు వేస్తుంటారు. ఒకే రకమైన గుర్తులుంటే చాలా మంది కన్‌ ఫ్యూజ్ అవుతుంటారు. ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బంది కలుగుతుంది. వేయాల్సిన పార్టీకి బదులు తికమకకు గురై వేరొక పార్టీకి ఓటు వేసే అవకాశం వుంది. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడ, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటివి అచ్చం కారు లాగే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలవర పెట్టిన గుర్తులు మరోసారి త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న గులాబీ పార్టీ అభ్యర్థులను భయపెడుతున్నాయి.

2018,2023 ఎన్నికల్లో నష్టం
2018, 2023 ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు చాలా నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. రోడ్ రోలర్, బుల్డోజర్ లాంటి గుర్తులతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ వాపోయారు. కారును పోలి ఉన్నందునే ఆయా గుర్తుల అభ్యర్థులకు ఓట్లు పడ్డాయంటూ తెలిపారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ ప్లాన్
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే త్వరలోనే జరుగనున్న స్థానిక సంస్థలు(సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్) ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని గులాబీ భావిస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి. అయితే కారును పోలిన గుర్తులు రోటిమేకర్, కెమెరా, షిప్ గుర్తులు ఉన్నాయని వాటిని ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వారికి కేటాయించొద్దని ఈసీని కోరుతుంది. ఈ రోజుల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కారు ఎలా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం గుర్తుల రాగం అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ఆపార్టీ ముందుగానే గుర్తులపై రాద్దాంతం మొదలు పెట్టిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ గుర్తుల వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పడానికేనా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా?
పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని చెబుతున్న గులాబీ అధిష్టానం.. మరీ ఎందుకు ఆ క్యాడర్‌తో ఓటర్లకు అవగాహన కల్పించ లేకపోతుంది. కేవలం ప్రకటనలతోనే ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుందా? అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి గుర్తులపై పోరాటం ఎందుకు చేస్తుందనేది పార్టీ క్యాడర్ సైతం చర్చించుకుంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో గుర్తులపై కోర్టుకు వెళ్తే తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం కారును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు పార్టీని ఎలాగైనా స్థానిక సంస్థల్లో సత్తాచాటి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తుంది. అయితే, ఏ మేరకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయనేది చూడాలి.

ఈసీకి బీఆర్ఎస్ వినతి
కారును పోలిన గుర్తులు కేటాయించొద్దని విజ్ఞప్తి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కారును పోలిన గుర్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించొద్దని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ రాణి కుముదినిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాష్ట్ర నాయకుడు సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను ఉపయోగించకూడదని కోరారు. ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలన్నారు. కారును పోలిన చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు జరిగిన నష్టాన్ని వినతి పత్రంలో వివరించారు.

Also Read: BRS: పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నైరాశ్యంలో గులాబీ క్యాడర్..

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?