Pregnancy Yoga tips: గర్భం దాల్చి ప్రతీ స్త్రీ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా జన్మిస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఇందుకోసం యోగా ఎంతగానో సహాయ పడుతుంది. ముఖ్యంగా గర్భిణి స్త్రీల కోసం యోగాలో ప్రత్యేకంగా ఓ అభ్యాసమే ఉంది. దానిని ప్రినేటర్ యోగా (Prenatal Yoga) అని పిలుస్తారు. సున్నితమైన ఆసనాలు, శ్వాస వ్యాయామాలు (ప్రాణాయామం), ధ్యాన పద్ధతులను అది కలిగి ఉంది. ఈ యోగా గర్భిణీల శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా రూపొందించబడింది. ప్రసవ సమయంలో సౌకర్యాన్ని, శక్తిని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
ప్రినేటర్ యోగాను ఎలా చేయాలి?
ప్రినేటర్ యోగాను ప్రారంభించే ముందు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి తన ఆరోగ్య పరిస్థితికి యోగా సురక్షితమని నిర్ధారించుకోవాలి. ప్రినేటర్ యోగాలో శిక్షణ పొందిన యోగా శిక్షకుడి మార్గదర్శకత్వంలో ఆసనాలు చేయడం ఉత్తమం. ప్రినేటర్ యోగాలో గర్భిణి స్త్రీల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు నిర్ధేశించారు.
❄️ వృక్షాసనం (Tree Pose): శరీర సమతుల్యత మరియు మానసిక ప్రశాంతత కోసం.
❄️ మార్జారీ ఆసనం (Cat-Cow Pose): వెన్ను నొప్పిని తగ్గించడానికి.
❄️ బద్ధకోణాసనం (Butterfly Pose): కటి ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి.
❄️ శవాసనం (Corpse Pose): రిలాక్సేషన్ కోసం. కానీ తొలి త్రైమాసికం తర్వాత వెనక్కి పడుకోకుండా పక్కకు వాలి చేయాలి.
ఏ సమయాల్లో చేయాలి?
ప్రినేటర్ యోగా చేయడానికి సాధారణంగా రెండవ (13-28 వారాలు), మూడవ త్రైమాసికాలు (29-40 వారాలు) సురక్షితమైన సమయాలు. ఎందుకంటే తొలి త్రైమాసికంలో గర్భస్థాపన సున్నితంగా ఉంటుంది. ఇక ఉదయాన్నే యోగా చేయడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాయంత్రం సమయాల్లో రిలాక్సింగ్ ఆసనాలు చేయడం నిద్రను మెరుగుపరుస్తుంది.
ప్రయోజనాలు ఏంటీ?
ప్రినేటర్ యోగా వల్ల గర్భిణీ స్త్రీలలో శారీరకంగా మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక లాభాల విషయానికి వస్తే.. గర్భంతో వచ్చే నడుము నొప్పి, కటి నొప్పిని ఇది తగ్గిస్తుంది. కటి, తొడలు, వెన్ను కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది సాధారణ ప్రసవానికి సహాయపడుతుంది. రక్తప్రసరణను పెంచి వాపు, అలసటను తగ్గిస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. మానసిక ప్రయోజనాల విషయానికి వస్తే.. బ్రీతింగ్ వ్యాయామాలు కార్టిసోల్ స్థాయిలను తగ్గించి మనసును రిలాక్స్ చేస్తాయి. రిలాక్సింగ్ ఆసనాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. శ్వాస నియంత్రణ, కండరాల బలం.. ప్రసవ సమయంలో ఇబ్బందులను తగ్గిస్తాయి.
Also Read: Ice Discovered in Space: అంతరిక్షంలో మంచుపై షాకింగ్ అధ్యయనం.. అందులో ఏం తేలిందో తెలిస్తే షాకే!
అలా అస్సలు చేయవద్దు
గర్భస్త స్త్రీలు తొలి త్రైమాసికంలో (1-12 వారాలు) గర్భస్థాపన సున్నితంగా ఉంటుంది కాబట్టి వైద్య సలహా లేకుండా యోగా చేయడం మానుకోవాలి. అధిక రక్తపోటు, గర్భాశయ సమస్యలు, గతంలో గర్భస్రావం, లేదా బహుళ గర్భాల వంటి సందర్భాల్లో యోగా చేయడం సురక్షితం కాకపోవచ్చు. యోగా చేస్తున్నప్పుడు కడుపు బిగుతుగా అనిపించడం, నొప్పి, లేదా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపివేయాలి. అటు డీప్ బ్యాక్ బెండ్స్ (ఉష్ట్రాసనం), పొట్టపై పడుకోవడం (భుజంగాసనం), తీవ్రమైన స్ట్రెచింగ్ లేదా ట్విస్టింగ్ ఆసనాలు, బ్యాలెన్స్ కోసం అధిక ఒత్తిడి కలిగించే ఆసనాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. భోజనం చేసిన వెంటనే యోగా చేయడం వల్ల అసౌకర్యం లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. యోగా చేసిన వెంటనే స్నానం చేయడం లేదా వేడి వాతావరణంలో యోగా చేయడం మానుకోవాలి.
Also Read: Warangal Crime: రాష్ట్రంలో ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య.. ఎలాగంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.