Malnadu Restaurant Drugs Case (IMAGE crediT: free pic)
హైదరాబాద్

Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు

Malnadu Restaurant Drugs Case: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. దీంట్లో అరెస్టైన ఆరుగురు నిందితులను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈగల్ టీం అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ వద్ద డ్రగ్స్​ దందా జరుగుతున్నట్టు సమాచారాన్ని సేకరించిన ఈగల్​ టీం అధికారులు, సైబరాబాద్ నార్కోటిక్​ పోలీసులతో కలిసి ఇటీవల దాడులు జరిపిన విషయం తెలిసిందే.

రెస్టారెంట్ వద్ద తన టాటా స్కార్పియో కారులో మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు జరిపి కారు డ్యాష్ బోర్డు నుంచి 3.2 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 1.6 గ్రాముల ఎక్టసీ పిల్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఇక, కారులోనే మహిళలు ధరించే హై హీల్స్ చెప్పుల హీల్​ భాగంలో దాచిన 1‌‌0గ్రాముల కొకైన్‌ను కూడా సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో హిమాయత్‌నగర్‌కు చెందిన హర్ష, కరీంనగర్‌కు చెందిన సందీప్​ జువ్వాడి, ఖాజాగూడ నివాసి పల్లెపాక మోహన్‌ ద్వారా సూర్య డ్రగ్స్​ తెప్పించుకున్నట్టుగా వెల్లడైంది.

 Also Read: Students Protest: అన్నంలో పురుగులు నీళ్ల చారు.. అమలుకాని మెనూ అసౌకర్యాల లేమి

వీరితోపాటు నైజీరియాకు చెంది ఢిల్లీ, బెంగళూరు, గోవాల్లో ఉంటున్న నిక్, జెర్రీ, డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్‌ల నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తెప్పించుకుంటూ ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇలా తెప్పించుకున్న డ్రగ్స్‌తో హైదరాబాద్‌లోని ప్రిజం పబ్​, ఫార్మ్ పబ్​, బ్లాక్ 22, బర్డ్​ బాక్స్, జోరా, బ్రాడ్​ వే, క్వాక్ ఎరీనా తదితర పబ్బుల్లో స్నేహితులు, ఇతరులతో కలిసి ఈ డ్రగ్స్‌తో పార్టీలు చేసుకున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో ఈగల్ టీం అధికారులు సూర్యతోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.

నాలుగు రోజుల కస్టడీకి
నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున వారిని కస్టడీకి అనుమతించాలంటూ ఈగల్ టీం అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నాలుగు రోజులపాటు నిందితులను కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు సోమవారం నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఎక్కడెక్కడ పార్టీలు.. ఎవరెవరు కొన్నారు?
పెడ్లర్ల నుంచి కొన్న డ్రగ్స్​ ఏ ఏ పబ్బులు, ఫాంహౌసుల్లో పార్టీలు చేసుకున్నారన్న విషయమై ఈగల్ టీం అధికారులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే సూర్య నుంచి మాదక ద్రవ్యాలు కొన్నవారి లిస్ట్ కూడా పెద్దదిగానే ఉండడంతో వాళ్లు ఎవరెవరు? అన్న దానిపై కూడా అడిగినట్టు సమాచారం. భీమవరానికి చెందిన ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ ప్రసన్న ఎలా పరిచయమయ్యాడు? అతనికి డ్రగ్స్ ఎలా పంపించే వాడివని సూర్యను ప్రశ్నించినట్టుగా తెలిసింది.

ఇప్పటికే మరో 23మంది వ్యాపార వేత్తలు కూడా డ్రగ్స్​ కొనేవారని వెల్లడైన నేపథ్యంలో వారి వివరాలను కూడా ఈగల్ టీం అధికారులు తీసుకుంటున్నట్టు సమాచారం. ఏయే కొరియర్ సంస్థల ద్వారా డ్రగ్స్​ తెప్పించే వాడివని కూడా అడిగినట్టు తెలిసింది. అయితే, చాలా ప్రశ్నలకు సూర్య సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తనకు తెలిసిన వివరాలన్నింటినీ ఇప్పటికే చెప్పానని జవాబు ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే, కస్టడీ ముగియడానికి ఇంకా మూడు రోజుల గడువు ఉండడంతో సూర్యకు మాదక ద్రవ్యాలు అమ్మిన నైజీరియన్లతో పాటు అతనితో కలిసి పార్టీలు చేసుకున్న వారు, డ్రగ్స్ కొన్నవారందరి గుట్టును రట్టు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో పోలీస్ అధికారుల సుపుత్రులు

మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారుల సుపుత్రులు ఉన్నట్టు ఈగల్ టీం అధికారుల దర్యాప్తులో వెళ్లడయ్యింది. పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం అధికారులు ఇటీవల కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ నడుపుతున్న సూర్యతోపాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వటంతో ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దీంట్లో ఎస్ఐబీలో రిటైర్ అయ్యి ప్రస్తుతం ఓఎస్డీగా పని చేస్తున్న నాన్ క్యాడర్ ఎస్పీ వేణుగోపాల్ రావు కుమారుడు రాహుల్ తేజ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని చెప్పిన ఓ అధికారి గత సంవత్సరం జనవరిలో నిజామాబాద్ పోలీసులు కూడా రాహుల్ తేజపై డ్రగ్స్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను విచారించినపుడు రాహుల్ తేజ ఢిల్లీ, పంజాబ్ ల నుంచి డ్రగ్స్ తెచ్చి తమకు ఇచ్చేవాడని స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. అయితే, పోలీస్ అధికారి కొడుకు కావటంతో నిజామాబాద్ పోలీసులు రాహుల్ తేజను అరెస్ట్ చెయ్యలేదని తెలిసిందన్నారు.

మరో డీసీపీ కుమారుడు..
ఇదే కేసులో ఈగల్ టీం అధికారులు మరో పోలీస్ అధికారి కుమారున్ని కూడా అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా ఉన్న అధికారి కుమారుడు మోహన్ కు కూడా డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెళ్లడయ్యింది. ఈ క్రమంలో మోహన్ ను కూడా ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరింత మంది ప్రముఖుల పేర్లు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Lashkar Bonalu: లష్కర్ రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు