Students Protest: గురుకులాలు, కస్తూర్భా పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెనూను సక్రమంగా అమలు చేయకపోవడం, అన్నంలో పురుగులు ఉంటుండడంతోపాటు నీళ్ల చారును వడ్డిస్తుండడంతో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సిన ప్రిన్సిపాల్స్, వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో నిర్వహణ గాడి తప్పుతున్నది. ఫలితంగా విద్యార్థుల సంక్షేమం సైతం గాలిలో దీపంలా మారుతున్నది. దేశానికే ఆదర్శంగా ఉండేలా వసతులు కల్పించడంతోపాటు సన్నబియ్యంతో రుచికరమైన భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తున్న ప్రభుత్వానికి కొంతమంది అధికారుల తీరు అప్రతిష్టను తెస్తున్నది.
Also Read: Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
ఉమ్మడి (Ranga Reddy District) రంగారెడ్డి జిల్లాలో వరుస ఘటనలు అటు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం డైట్ ఛార్జీలను గణనీయంగా పెంచడంతోపాటు మెనూలోనూ సమూల మార్పులు చేసింది. అయితే, మెనూను ఎవరూ పక్కాగా అమలు చేయడం లేదు. కొన్ని చోట్ల పురుగుల అన్నంతోపాటు నీళ్ల చారును వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాణ్యత లేని భోజనం వండి పెడుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందాల్సి వస్తున్నది.
రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో రెండు చోట్ల చోటు చేసుకున్న ఘటనలు నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు తింటున్న అన్నంలో పురుగులు రావడంతో ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇదే మండలంలోని సిరిపురం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో పురుగులు ఉన్న అన్నాన్ని విద్యార్థులకు వడ్డించారు.
పేరెంట్స్ మీటింగ్ సందర్భంగానే ఈ ఉదంతం చేసుకోవడంతో తల్లిదండ్రులు(Parents) నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఇదే రకమైన భోజనం తింటే తమ పిల్లల పరిస్థితి ఏంటని? వారు ఆవేదన చెందుతున్నారు. తాజాగా, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలోని కూకట్‌పల్లికి బ్రాంచ్‌కు చెందిన బీసీ గురుకుల బాలుర పాఠశాలలోనూ విద్యార్థులు సోమవారం నిరసనకు దిగారు. నాణ్యమైన భోజనం వడ్డించకపోవడంతో పాటు వసతుల లేమి వల్ల ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వసతులు లేమి.. పర్యవేక్షణ కొరవడి
గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలైనా, అద్దె భవనాలైనా! సమస్య మాత్రం కామన్‌గానే ఉంటున్నది. తాగునీటి ఇబ్బందులతోపాటు అరకొర బాత్రూమ్‌లతో విద్యార్థులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తుర్కపల్లి గ్రామంలోని కూకట్‌పల్లి బ్రాంచ్‌కు చెందిన బీసీ గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులకు రెండు బాత్రూమ్‌లు మాత్రమే ఉండగా, అవి కూడా సరిగా లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. బాత్రూమ్‌కు డోర్ కూడా లేదని, బాగు చేయాలని చెప్పినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలాచోట్ల కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు గడపాల్సి వస్తున్నది. తరచుగా జ్వరాలు, వ్యాధులు బారిన పడుతున్నారు. ఇక వర్షాకాలం, చలి కాలాల్లో విద్యార్థులు పడే బాధలు వర్ణణాతీతం. 24 గంటల పాటు పర్యవేక్షించాల్సిన వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండకపోవడం, నెలలో ఒక్కసారైన సందర్శించాల్సిన ఉన్నతాధికారులు సైతం ముఖం చాటేయడంతో సంక్షేమ వసతి గృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నిర్వాహకుల తీరు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉంటున్నదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Toddy Shops: కల్లు కాంపౌండ్లపై స్పెషల్ డ్రైవ్.. పక్కాగా వివరాలు సేకరించేందుకు ప్లాన్