Lashkar Bonalu: నా ప్రజలంతా సంతోషంగా బోనాల జాతర జరుపుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, బ్యాండ్ వాయిద్యాల మధ్య బోనాలు, (Bonalu) సాఖలతో చేసిన పూజలను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ప్రతి సంవత్సరం నా కోరిక చెబుతున్నా, ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు. నాకు రక్త బలిని చూపించండి అంటూ లష్కర్ బోనాల్లో (Lashkar Bonalu) భాగంగా సోమవారం నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి విన్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలయంలో నా నిజ రూపాన్ని ప్రతిష్టించేందుకు కొందరు అడ్డుకుంటున్నారని, ఈ ఏడు ప్రతిష్టించక పోతే ఎవరెవరు అడ్డుకుంటున్నారో వారు రక్తం కక్కుతారన్నారు. ప్రతి ఏటా ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉన్నారు, అయినా నేను క్షమిస్తూనే ప్రతి ఒక్కరినీ కాపాడే బాధ్యతను తీసుకున్నానని స్పష్టం చేశారు. బాలలను తల్లిదండ్రులు పట్టించుకోకుండా విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, అలాంటి వారిని కూడా నేనే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు.
Also Read: Ganja Gang Arrested: భాయ్ బచ్చా ఆగయా.. వంద మంది గంజాయి బాబుల గుట్టు రట్టు
కావాల్సినప్పుడల్లా విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నా, మీరు కోరిన విధంగా మీకు అన్ని రకాలుగా రక్షగా ఉంటున్నానని, నిత్యం జరిపే పూజలు సక్రమంగా నిర్వహించాలని, ఐదు వారాలు నాకు పప్పు, బెల్లంతో పూజలు చేయండని, అలాగే నా రూపాన్ని ప్రతిష్టించాలని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత వ్యాఖ్యానించారు. బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం కూడా లష్కర్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సందడి నెల కొన్నది. ఆలయం ఆవరణలో పోతరాజులు, యువకుల నాట్య విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అమ్మవారి ఆజ్ఞను శిరస్సా వహిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
రంగం కార్యక్రమంలో అమ్మవారి ఆదేశాలను శిరస్సా వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రంగం కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారు రక్తబలిని కోరిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పిన విధంగా అమ్మవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని పూజలు సక్రమంగా జరిగేలా ఏర్పాట్లను చేస్తామన్నారు. రక్తబలి విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించి, సానుకూలమైన నిర్ణయం తీసుకునేలా చర్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
వైభవంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపు
రంగం కార్యక్రమం అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అంబారీపై ఆనవాయితీగా రాజు అంబారీపై ఎక్కి ఊరేగింపు నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు మార్కెట్ స్ట్రీట్ మీదుగా మెట్టుగూడలోని అమ్మవారి టెంపుల్ వరకు సాగింది. దారి పొడవునా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు దీరారు. ఊరేగింపు కొనసాగిన ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు.
నిర్బంధాల మధ్య బోనాల జాతర : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్బంధాల మధ్య ముగిసిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రంగం కార్యక్రమం ముగిశాక ఆయన ఆలయానికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 3 గంటలకు తెరవాల్సిన ఆలయం 4 నాలుగు గంటల 10 నిమిషాలను తెరవడాన్ని తలసాని తప్పుబట్టారు. 4 గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం ఉందని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఆలయాల వద్ద రాజకీయాలు చేయొద్దని శాస్త్రబద్ధంగా జరగాల్సిన పూజాధికాలను జరిపించాలని వ్యాఖ్యానించారు.
Also Read: Telangana BJP: కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? మళ్లీ పాత వారికేనా?