Operation Baam: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పోరాడుతున్న వేర్పాటువాద గ్రూపుల్లో ఒకటైన బీఎల్ఎఫ్ (బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) పోరాట వ్యూహాన్ని మార్చింది. ‘ఆపరేషన్ బామ్’ పేరిట పాక్ మిలటరీ స్థావరాలు, పోలీస్ అవుట్‌పోస్టులు, టెలికమ్యూనికేషన్ సదుపాయాలు, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు మొదలుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్‌లోని తుర్బట్‌లో బుధవారం గ్రనేడ్ దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు బైక్‌లపై వచ్చి తుర్బట్ పట్టణంలోని కేచ్ జిల్లా పరిధిలోని అబ్‌సార్ అనే ప్రాంతంలో మహ్మద్ యూనిస్ అనే ప్రముఖ వ్యక్తి నివాసం వెనుక భాగంలో గ్రనేడ్ విసిరారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో హజ్రా, మహ్లబ్, ఫాతిమా, నజ్ గుల్, మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తులు గాయపడ్డారని వివరించారు. బాధితులను వెంటనే తుర్బట్ జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. సిబిలోని ఒక పోలీస్ చెక్‌పోస్టుపై కూడా గ్రనేడ్ దాడి జరిగిందని, అయితే, ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
మంగళవారం రాత్రి నుంచి మొదలు
బీఎల్ఎఫ్ ప్రారంభించిన ‘ఆపరేషన్ బామ్’తో బలూచిస్థాన్ అంతటా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పంజ్‌గూర్, సురాబ్, కేచ్, ఖరాన్ జిల్లాల్లో ఇప్పటివరకు మొత్తం 17 దాడులు నమోదయ్యాయని స్థానిక అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలన్నీ మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిగాయి. కేచ్, పంజ్‌గూర్ జిల్లాల్లో టెలికం వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ నిలిచిపోయినట్టు సమచారాం. బీఎల్ఎఫ్ దాడులకు ప్రతి స్పందనగా భద్రతా దళాలు చర్యలు ప్రారంభించాయి. పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నాయి. ఈ పరిణామంపై పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. పాకిస్థాన్ ఆర్మీ కూడా స్పందించలేదు. అయితే, రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో సైనిక గస్తీ, చెక్‌పోస్టుల సంఖ్య పెరిగాయి. సమన్వయంతో ఈ దాడులు జరుపుతున్నట్టు బీఎల్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also- Radhika Yadav Murder Case: తండ్రి చేతిలో టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!
అతిపెద్ద తిరుగుబాటు!
గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో జరుగుతున్న అతిపెద్ద తిరుగుబాటు దాడులు ఇవేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది, ఎంత ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆపరేషన్ బామ్‌పై బీఎల్‌ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రం బలూచ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా బలూచ్ యోధులు సమన్వయంతో, తీవ్ర స్థాయిలో దాడులు చేయగలరని నిరూపించామన్నారు. తమ పోరాటంలో ఇది కొత్త దశకు నాంది అని గ్వాహ్రం బలూచ్ పేర్కొన్నారు.
Read Also- Ponguleti Srinivas Reddy: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్.. లోకల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు
బామ్ అంటే ‘ఉషోదయం’ అని బీఎల్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బీఎల్‌ఎఫ్ సంస్థ గత రెండు దశాబ్దాలుగా బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. బలూచిస్థాన్‌లో ఖనిజ సంపద విస్తారంగా ఉన్నప్పటికీ, అభివృద్ధిలో మాత్రం రాష్ట్రం వెనుకబడి ఉందని వేర్పాటువాదులు చెబుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలపై పాకిస్థాన్ ప్రభుత్వం వివక్ష చూపెడుతోందని, అవకాశాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది కనిపించకుండా పోతున్నారని బీఎల్ఎఫ్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.