Radhika Yadav Murder Case: హర్యానాలోని గురుగ్రామ్ లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ (25)ను కన్నతండ్రే హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో అల్లాముద్దుగా పెంచుకున్న బిడ్డను తండ్రి దీపక్ యాదవ్ ఎందుకు చంపారన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. బంధువుల మాటలను విని.. కూతుర్ని హత్య చేసినట్లు తండ్రి అంగీకరించారు. అలాగే ఓ మ్యూజిక్ వీడియో తలెత్తిన వివాదం గురించి కూడా తెలియజేశారు.
వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి అయిన రాధిక యాదవ్ ను తండ్రి దీపక్ యాదవ్ తన నివాసంలో మూడుసార్లు తుపాకీతో కాల్చి హత్య చేశారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు గల కారణాలను దీపక్ యాదవ్ (Deepak Yadav) వివరించారు. దీని ప్రకారం గురువారం ఉ.10:30 గంటల ప్రాంతంలో ఆహారం సిద్ధం చేస్తుండగా వెనకి నుంచి రాధికను కాల్చినట్లు తండ్రి అంగీకరించాడు. మాజీ బ్యాంక్ ఉద్యోగి అయిన దీపక్.. తన కుమార్తె ఆర్థికంగా ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేకపోయారు. ముఖ్యంగా సెక్టార్ 57లో సొంతంగా టెన్నిస్ అకాడమీ ప్రారంభించిన దగ్గర నుంచి అతడి కోపం మరింత ఎక్కువైంది. దీనికి తోడు ఇటీవల రాధిక ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించడం తండ్రిలో అసహనాన్ని మరింత పెంచింది. ఈ విషయమై ఇంట్లో పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది.
వివాదానికి దారి తీసిన వీడియో
ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇనాం చేసిన ‘కార్వాన్’ అనే పాట (రీల్)లో రాధిక నటించింది. దీనిని జీషన్ అహ్మద్ అనే వ్యక్తి నిర్మించి.. ఎల్ఎల్ఎఫ్ రికార్డ్స్ లేబుల్ కింద గతేడాది విడుదల చేశారు. ఈ వీడియోలో ఇనామ్ తో కలిసి రాధిక చాలా క్లోజ్ గా నటించడం తండ్రి దీపక్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దానిని సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆయన పట్టుబట్టారు. అయితే తండ్రి మాటలను రాధిక పట్టించుకోలేదని తెలుస్తోంది. పైగా మరిన్ని మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ వెళ్లిందని సమాచారం.
Also Read: Kerala Class Rooms: పాపం బ్యాక్ బెంచర్స్.. ఇలా బుక్కయ్యారేంటీ.. ఇక కష్టమే!
బంధువుల హేళన
అయితే కూతురు ఆర్థికంగా ఎదగడాన్ని తండ్రి దీపక్ యాదవ్ జీర్ణించుకోలేకపోవడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఇటీవల తన సొంత గ్రామం వజీరాబాద్ కు వెళ్లిన తనను సొంత బంధువులు ఎగతాళి చేసినట్లు దీపక్ పోలీసులకు తెలిపాడు. కూతురి సంపాదనపై జీవిస్తున్నావంటూ సూటిపోటీ మాటలు అన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన కూతురి వ్యవహారశైలిని కూడా తప్పుపట్టారని అన్నారు. దీంతో తన కూతురు స్థాపించిన టెన్నీస్ అకాడమీని మూసివేయాలని తాను చెప్పినట్లు దీపక్ అంగీకరించాడు. అయితే అందుకు ఆమె నిరాకరించినట్లు దీపక్ యాదవ్ పోలీసులకు తెలిపాడు దీంతో గురువారం వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తున్న కూతురిపై తన లైసెన్స్డ్ రివాల్వర్ తో ఐదుమార్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. అందులో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయని వివరించారు.