Kerala Class Rooms: సాధారణంగా స్కూళ్లు, కాలేజీలు అనగానే బ్యాక్ బెంచ్ విద్యార్థులే (Back Bench Students) గుర్తుకువస్తారు. క్లాస్ లో చివరి వరుసలో కూర్చునే ఆ విద్యార్థులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ముందు బెంచ్ లో కూర్చునే విద్యార్థులు ఎంతో శ్రద్ధగా పాఠాలు వింటుంటే.. వారు మాత్రం రహస్యంగా దాచుకున్న ఫుడ్ తింటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ తమ లోకం తమదే అన్నట్లు ప్రవర్తిస్తారు. అంతేకాదు బ్యాక్ బెంచర్స్ కు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వారికి చదువురాదన్న ముద్ర సైతం టీచర్లు, తోటి స్టూడెంట్స్ వేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చే దిశగా కేరళ అడుగులు వేస్తోంది. అది ఎలాగో ఈ కథనంలో పరిశీలిద్దాం.
యూ ఆకార సీటింగ్ విధానం
కేరళలోని చాలా వరకూ స్కూళ్లలో బ్యాక్ బెంచర్స్ అనే భావనకు స్వస్థి పలికేలా కొత్త సీటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మలయాళ చిత్రం ‘స్థానార్థి శ్రీకుట్టన్’ (Sthanarthi Sreekuttan)లో చూపించిన విధంగా U-ఆకార సీటింగ్ విధానాన్ని పలు పాఠశాలలు అవలంభిస్తున్నాయి. రో బేస్డ్ సీటింగ్ కు బదులుగా విద్యార్థులను సెమీ సర్కిల్ లో కూర్చోబెడుతున్నారు. తద్వారా ప్రతీ విద్యార్థి ఏకాగ్రతతో పాఠాలు వినేలా.. స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.
View this post on Instagram
ఇంప్రెస్ అయిన మంత్రి
ఈ యూ – ఆకారపు సీటింగ్ విధానంలో మెుట్టమెుదట కేరళలోని కొల్లం జిల్లాలోగ గల ఆర్ వీవీ హెచ్ఎస్ఎస్ (RVV HSS) స్కూల్లో అమలు చేయబడింది. దీనిని కేరళ రవాణా మంత్రి, మలయాళ నటుడు కేబీ గణేష్ కుమార్ (KB Ganesh Kumar) నిర్వహిస్తుండటం విశేషం. ‘స్థానార్థి శ్రీకుట్టన్’ విడుదలకు ముందు.. ఆ మూవీని సదరు మంత్రికి చిత్ర బృందం చూపించింది. అందులో చూపించిన యూ ఆకారపు సీటింగ్ విధానం చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. దీంతో తన ఆధ్వర్యంలోని పాఠశాలలోనే ఈ సీటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రతీ విద్యార్థిపై ఫోకస్
కొల్లంలోని ఆర్ వీవీ హెచ్ఎస్ఎస్ స్కూల్ తో పాటు కన్నూర్‌లోని పప్పినిస్సేరి వెస్ట్ ఎల్పీ స్కూల్, పాలక్కాడ్‌లోని జీహెచ్ఎస్ఎస్ వంటి పాఠశాలలు యూ సీటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ సీటింగ్ విధానం విద్యార్థుల మధ్య సమానత్వాన్ని, సహకారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు టీచర్లు చెబుతున్నారు. ఈ విధానంలో ప్రతీ విద్యార్థిపై ఏకాగ్రత పెట్టగలుగుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!
కేరళ ప్రభుత్వం అధ్యయనం
పాఠశాలలో యూ సీటింగ్ విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎస్. షణవాస్ స్పందించారు. ఈ విధానాన్ని అన్ని పాఠశాలలో విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ముందు తరగతి గదుల పరిమాణం, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే యూ సీటింగ్ విధానం ఇవాళ వచ్చిన కొత్త ఆలోచన కాదని.. 1994లో డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (DPEP)లో ఇలాంటి సౌఖర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లను సూచించారని గుర్తుచేశారు. అయితే స్థానార్థి శ్రీకుట్టన్ చిత్రం.. దీనిని శాశ్వతంగా అమలు చేయడానికి ప్రేరణగా నిలిచిందని అన్నారు.