Ponguleti Srinivas Reddy: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని వెల్లడించారు. గురువారం ఆయన క్యాబినెట్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఇందిరమ్మ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయబోతున్నామన్నారు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించిందన్నారు.
విద్యా ,ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించే ఆ రెండు బిల్లులను అదే రోజు అసెంబ్లీలో ఆమోదించిందన్నారు. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని వివరించారు. వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: GHMC Serilingampalle: జీహెచ్ఎంసీలో టెక్నికల్ దుర్వినియోగం? అర్ధరాత్రి ఐడి లాగిన్!
ఆ యూనివర్సిటీల్లో 50 శాతం సీట్లు
ఇక బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ చైర్మన్‌లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణిస్తారన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు.
అమిటీ(ఏఎమ్ ఐటీవై), సెయింట్ మేరీ రిహాబలిటేషన్ యూనివర్సిటీలు రాబోతున్నాయన్నారు. ఈ యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్ధులకు 50 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధనను కూడా విధించామన్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు జిన్నారం, ఇంద్రేశంలు ఏర్పడ్డాయని, ఆయా మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అంతేగాక రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. వచ్చే కేబినేట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్‌లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించినట్లు వివరించారు.
నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికలకు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశామన్నారు. దానిని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించామన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరుపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 19 వ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ కు మద్ధతు ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే రోల్ మోడల్ కానున్నదని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 60 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. మరో 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. మార్చి లోపు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్తగా మరో 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించిందన్నారు. అంతేగాక వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించిందన్నారు.
Also Read: Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లి ప్రియుడితో కలిసి ఘాతుకం
గోశాలల నిర్మాణానికి క్యాబినెట్ నిర్ణయం
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో 306 గోశాలలున్నాయని, హైదరాబాద్‌లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వివరించారు. స్పోర్ట్స్ పాలసీలను సమర్ధవంతంగా తయారు చేసి అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు అనుగుణంగా ఉంటుందన్నారు.
18 క్యాబినెట్‌లపై చర్చ.. ఈ నెల 25న మరో క్యాబినెట్
కేబినెట్ సమావేశం దాదాపు 4 గంటల పాటు జరిగింది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టులపై చర్చించినట్లు తెలిసింది. రేషన్ కార్డుల జారీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలపై కూడా డిస్కషన్ చేశారు. అయితే 7 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 19 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. ఇందులో 18 క్యాబినెట్ వరకు 23 ప్రధానమైన శాఖల్లో జరిగిన 327 అంశాలపై చర్చ జరగగా, 321 అంశాలను క్యాబినెట్ ఆమోదించింది.
వాటిపై 19వ క్యాబినెట్‌లో డిస్కషన్ జరిగింది. ఆయా అంశాలు ఎలా అమలవుతున్నాయి? ప్రజలకు ఏ మేరకు లబ్ధి జరిగింది? ఇంకా ఏం మార్పులు చేయాలి? తదితర అంశాలన్నింటిపై 19వ క్యాబినెట్‌లో చర్చ చేశారు. అంతేగాక వేగంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు.19వ క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రులతో పాటు 23 శాఖల అధికారులు పాల్గొన్నారు. గతంలో ప్రకటించినట్లే ఇక నుంచి వారానికి రెండు సార్లు క్యాబినెట్‌లు నిర్వహిస్తారు. తదుపరి క్యాబినెట్ సమావేశం ఈ నెల 25న జరగనున్నది. ప్రతి మూడు నెలలకు ఓ సారి రివ్యూ క్యాబినెట్ జరగనున్నది. ఈ విధానం దేశంలోనే ఫస్ట్ టైమ్ అని మంత్రులు తెలిపారు.
Also Read: Karan Johar: కరణ్ జోహార్‌కు ఏమైంది?.. మరీ ఇలా మారిపోయారేంటి?