GHMC RV Karnan: జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో కీలకమైన ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లలో పారదర్శకతను పెంచేందుకు కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (Commissioner RV Karnan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రేడ్ లైసెన్స్ జారీ, రెన్యూవల్, ఛార్జీల వసూళ్ల బాధ్యతలను ఇకపై లైసెన్సింగ్ ఆఫీసర్లు, శానిటరీ జవాన్ల నుంచి తొలగించి, ప్రతి సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల (ఏఎంసీలు)కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కొన్ని సర్కిళ్లలో ట్రేడ్ లైసెన్స్ ఛార్జీల వసూళ్లలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు.
Also Read: Private Education: ప్రైవేట్ విద్యాసంస్థల మజాకా?.. మమ్మల్ని ఆపేవారు లేరు!
అక్రమాలకు చెక్..
ఈ మేరకు కమిషనర్ అన్ని సర్కిళ్లకు సర్క్యులర్ జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించిన మొత్తం ఇన్‌చార్జ్‌లుగా ఇకపై ఏఎంసీలే వ్యవహరిస్తారని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించిన ఫీజులను వసూలు చేయడంతో పాటు, అసెస్‌మెంట్ చేసిన ప్రాపర్టీల రివిజన్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు అసెస్‌మెంట్ కాకుండా ఉన్న ఆస్తులను గుర్తించి, వాటిని అసెస్‌మెంట్ చేసి, ఆస్తి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
జీహెచ్ఎంసీ (GHMC) యాక్ట్ 1955లోని సెక్షన్ 521, 622(1), 622(2) ప్రకారం ప్రతి వ్యాపార సంస్థ జీహెచ్ఎంసీ (GHMC) నుంచి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపార సంస్థలకు లైసెన్స్ జారీ చేసే బాధ్యతలను కూడా కమిషనర్ ఏఎంసీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో స్పెషల్ డ్రైవ్..
మహానగరంలోని 30 జీహెచ్ఎంసీ (GHMC) సర్కిళ్ల పరిధిలో ప్రతి ఆస్తి ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి, ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి వచ్చేలా ఏఎంసీలు తమతమ సర్కిళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి వ్యాపార సంస్థకు ట్రేడ్ లైసెన్స్ ఉందా, లేని పక్షంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేసి, ట్యాక్స్ చెల్లించని పక్షంలో వారికి వెంటనే ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (టీఐఎన్) జనరేట్ చేసి, వారిని ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
బడా వ్యాపార సంస్థలైన హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లను ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి, నాన్ రిజిస్టర్డ్ ప్రాపర్టీలను నెలరోజుల వ్యవధిలోనే గుర్తించాలని కమిషనర్ డెడ్‌లైన్ విధించారు. ఈ విధులను పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ప్రతి రోజు ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి, పరిశీలించిన వ్యాపార సంస్థలు, ఆస్తుల వివరాలను లాగ్ బుక్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వీటికి తోడు, అదనపు కమిషనర్ (రెవెన్యూ) ఆదేశాలను కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
Also Read: Gold Rates (05-07-2025): మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్