Serilingampally circle: అక్రమ నిర్మాణాలపై బల్దియా ప్రయోగిస్తున్న సీజింగ్ మంత్రం విమర్శలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణదారుల్లో భయం పక్కన పెడితే అధికారులకు మాత్రం ఈ వ్యవహారం కాసులు కురిపిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలంటూ ఇటీవల జిహెచ్‌ఏంసీ(GHMC) కమిషనర్ స్వయంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా టౌన్ ప్లానింగ్(Toun Planing) అధికారులు తాము ఇన్ని రోజులుగా చూసీ చూడనట్లు వ్యవహరించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు.
సీజ్ చేసిన భవనాలు నిర్మాణాలు
శేరిలింగంపల్లి(Sherelingam Pally) సర్కిల్-20 పరిధిలో పలు ప్రాంతాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేసి, మీడియాలో వార్తలు సైతం రాయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే, ప్రస్తుతం సీజ్ చేసిన భవనాలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా కొన్ని చోట్ల హాస్టళ్లు(Hostale), మరి కొన్ని చోట్ల అద్దెలు కొనసాగుతున్నాయి. అధికారులు వేసిన సీజింగ్ తలుపులను విరగొట్టగా, ఏర్పాటు చేసిన బ్యానర్లను చెత్త బుట్టల్లో పడ వేశారు.
సీజింగ్ పేరిట కాలయాపన ఎందుకో!
అక్రమ నిర్మాణాలపై శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు సీజింగ్ పాట పాడుతూ కాలయాపన చేస్తున్నారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రతి సోమవారం(Monday) జంట సర్కిళ్లతో పాటు జోనల్ కార్యాలయంలో కొనసాగే ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులలో అధికంగా అక్రమ నిర్మాణాలపై వస్తున్నాయంటే టౌన్ ప్లానింగ్(Toun Plning) అధికారుల కాసుల కక్కుర్తి ఎంతగా కొనసాగుతోందన్నది అర్థం చేసుకోవచ్చు.
Also Read: By Polls 2025: ఉపఎన్నికల్లో మారిపోయిన ఆప్, బీజేపీ ముఖచిత్రాలు
డబుల్ ధమాకా!
అక్రమ నిర్మాణాలతో చేతులు తడుపుకుంటున్న అధికారులకు సీజింగ్ పేరుతో అదే భవన యజమానుల నుంచి దండుకునేందుకు అవకాశం దొరికిందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఉన్నత అధికారులు అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు తీసుకువచ్చిన సీజ్ ప్రక్రియ టౌన్ ప్లానింగ్ అధికారులకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అధికారులు తీసుకున్న మంచి నిర్ణయం సైతం వీళ్లకు కాసులు కురిపిస్తూ డబుల్ ధమాకాలా ఉందని ప్రజానీకం మండిపడుతోంది. పేద, మధ్యతరగతి జనాలు చిన్నపాటి గోడ కట్టినా గద్దల్లా వాలిపోయే టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి అక్రమంగా కడుతున్న బహుళ అంతస్తులు మాత్రం కనిపించటం లేదని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.కోట్లలో గండి
శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందన్న టాక్ నడుస్తోంది. సమయానికి ఆఫీసులో ఉండరు ఉన్నా సమస్యలను పట్టించుకోరని ప్రజలు వాపోతున్నారు. అక్రమ నిర్మాణదారులను, బిల్డర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిత్యం బిజీగా ఉంటున్నారన్న విమర్శలను వారు మూటగట్టుకుంటున్నారు. జిహెచ్‌ఎంసీ(GHMC) టౌన్ ప్లానింగ్(Toun Planing) అధికారుల కక్కుర్తితో రూ.కోట్లలో ఖజానాకు గండి పడుతోంది. నిర్మాణ అనుమతులు తీసుకుంటే అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తుందని, వృధా ఖర్చులు ఎందుకంటూ నిర్మాణదారులతో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి.
అంతస్తుకు ఒక రేటు ఫిక్స్
అంతస్తుకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని తమ అక్రమ దందాలను యదేచ్ఛగా సాగిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఉన్నత అధికారులు కన్నెర్ర చేసిన ప్రతిసారి తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ప్రచారమూ ఉంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సక్రమ నిర్మాణాల వైపు ప్రజలు దృష్టి పెట్టరేమోనన్న అనుమానాలను పలువురు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ISKCON Monk: సుందర్ పిచాయ్ ప్రశ్నకు ఇస్కాన్ సన్యాసి ఇచ్చిన సమాధానం ఇదే