By Polls 2025: దేశవ్యాప్తంగా 5 నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల (By Polls 2025) ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే విశ్లేషణ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) భారీ ఉపశమనం లభించింది. పంజాబ్‌లోని లూథియానా పశ్చిమ, గుజరాత్‌లోని విశావదర్ శాసనసభ స్థానాలను ఆ పార్టీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) కేరళలోని నిలంబూర్ నియోజకవర్గంలో గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. మొత్తం ఐదు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా గుజరాత్‌లోని కడిని నియోజకవర్గంలో విజయం సాధించింది.
లూథియానా పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు కోసం ఆప్ తన సర్వశక్తులు వడ్డింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిశీ, అరోరా వంటి అగ్రనాయకులను ప్రచారానికి దించింది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉప ఎన్నికపై కేజ్రీవాల్ వ్యక్తిగత పర్యవేక్షణ చేశారు. ఇక, హస్తం పార్టీ గెలిచిన నిలంబూర్ స్థానం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. అందుకే, ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడింది.
ఉప ఎన్నికలు జరిగింది ఐదు నియోజకవర్గాలకే అయినప్పటికీ బీజేపీకి, ఇండియా కూటమికి మధ్య రాజకీయ బల పరీక్షగా విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్, కేరళలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆప్‌లో ఈ ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్ నింపాయి. పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read this- Viral News: బీజేపీ ఎమ్మెల్యేకు సీటు నిరాకరించిన ప్యాసింజర్.. నెక్స్ట్ స్టేషన్‌లో
బైపోల్ లెక్కలు ఇవే
కేరళలోని నిలంబూర్ సీటును కాంగ్రెస్ సారధ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) 11,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుచుకుంది. అధికార వామపక్ష పార్టీ అభ్యర్థి యూడీఎఫ్ అభ్యర్థి ఎం స్వరాజ్‌పై ఆర్యాదన్ మొహమ్మద్ గెలిచారు. ఈ విజయంతో మొత్తం 8 సార్లు ఆయన ఈ సీటును గెలుచుకున్నారు. ఈ స్థానంలో గెలుపును కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం పినరయి విజయన్‌తో విభేదాల కారణంగా స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో ఈ స్థానం నుంచి ఆయన 2,700 ఓట్ల తేడాతో గెలిచిన అన్వర్, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పంజాబ్‌లో లూథియానా పశ్చిమ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ రాజ్యసభ ఎంపీ, పారిశ్రామికవేత్త అయిన ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ రెండవ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి చనిపోవడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
Read this- IndiGo: వెళ్లి చెప్పులు కుట్టుకో.. ఇండిగో ట్రైనీ పైలట్‌పై కులవివక్ష!
గుజరాత్‌లో చెరోటి
గుజరాత్‌లోని విసావదర్ నియోజకవర్గంలో ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సంచలన విజయం సాధించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కిరీట్ పటేల్‌పై 17,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకి కంచుకోట అయిన గుజరాత్‌లోఆప్ గెలవడం సంచలనంగా మారింది. ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ 2023లో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, స్థానాం ఖాళీ అయింది. కడి నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్సీ రిజర్వర్డ్ అయిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి రమేష్ చావ్డా, ఆప్ నుంచి జగదీష్ చావ్డా పోటీ చేయగా, వీరిపై బీజేపీ రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది.
ఇక, పశ్చిమ బెంగాల్‌లో నదియా జిల్లా పరిధిలోకి వచ్చే కాలిగంజ్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలీఫా అహ్మద్ ఏకంగా 50,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అలీఫా తండ్రి, తృణమూల్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణించారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.