Telangana: సమాజంలో ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ‘బాబోయ్.. పెళ్లి వద్దు’ అనే మాటలు యువత నోట వినిపిస్తున్నాయి. ఎక్కడో జరిగిన సంఘటనల సంగతి అటుంచితే.. తెలంగాణలో జరిగిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లికాని (Marriage) ప్రసాద్‌లు ఉలిక్కిపడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా.. జరిగినవన్నీ కళ్లారా చూస్తున్నా ‘పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.. అవసరమైతే సింగిల్‌గానే చచ్చిపోతాం’ అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు, కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఇక అసలు విషయానికొస్తే.. పెళ్లైన నెల రోజులకే జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌ను భార్య, తల్లి, ఓ బ్యాంక్ మేనేజర్ చంపిన ఘటనలో (Gadwal Wife And Husband Incident) రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తున్నది. తాజాగా నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇంతకీ 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also- Gadwal: గద్వాలలో మరో సోనమ్.. పెళ్లయిన నెల రోజులకే భర్త హత్య!
ఏం తేలింది..?
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. పక్కనే ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెద్దలు వివాహం నిశ్చయం చేశారు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు అక్రమ సంబంధం ఉండటంతో.. ప్రియుడితో కలిసి బతకాలని భావించిన భార్య.. పెళ్లయిన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. కూతురు, తల్లి సుజాతను పోలీసులు లోతుగా విచారించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లీ, కూతురు ఇద్దరితోనూ ఓ బ్యాంకు ఉద్యోగి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో 2వేల ఫోన్ కాల్స్ ఐశ్వర్య మాట్లాడినట్లుగా తేలింది. చూశారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేలసార్లు ఫోన్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ ఒకెత్తయితే సరిగ్గా పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కనీసం కుటుంబీకులకు కానీ.. చేసుకోయే భర్తకు కానీ అందుబాటులో లేకుండా పోయింది. అయితే.. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంక్‌కు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు కానీ, అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగోచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్‌తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని మాయ మాటలు చెప్పింది.
నువ్వంటే నాకిష్టం అని..
‘ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదలి ఉండలేను.. నువ్వేకావాలి.. నిన్నే పెళ్లి చేసుకుంటా’ అంటూ అబ్బో సినిమాకు మించి ఓ రేంజిలో తేజేశ్వర్‌కు చెప్పి నటించింది. అయ్యో పాపం.. ఐశ్వర్య అంటూ తేజేశ్వర్ మనసు కరిగిపోయింది. బహుశా ఇక్కడే కాస్త ఆలోచించి ఉంటే కుర్రాడు బతికేవాడేమో..! ఆమె మాటలు నమ్మిన తేజు పెళ్లికి అంగీకరించాడు. ఐదు రోజులు కనిపించకుండా పోవడం.. నలుగురూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.. అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పేశారు. అయినా సరే తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి ‘మే’ 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఫస్టాప్ మాత్రమే చూపించిన ఐశ్వర్య.. పెళ్లయిన రోజు నుంచి సెకాండాఫ్ సినిమా భయంకరంగా చూపించింది. మూడు ముళ్లు, ఏడడుగులు వేసిన భర్తను పట్టించుకోకుండా ఐశ్వర్య నిత్యం ఫోన్‌లోనే మునిగిపోయింది. భర్తను పట్టించుకోలేదు.. కనీసం మాట్లాడిన పాపాన కూడా పోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ తప్ప వేరే యావే లేదట. ఛార్జింగ్ లేకపోతే కాస్త గ్యాప్ ఇచ్చేదట. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. ఈ ఫోన్ కాల్స్ వల్ల రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సరిగ్గా పెళ్లయిన నెలరోజులకు (ఒక్కరోజు ముందే) జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. తమ బిడ్డ ఏమయ్యాడని తల్లిదండ్రులు.. సోదరుడు కనిపించట్లేదని అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆంధ్రాలోని కర్నూలు జిల్లా పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తొలుత ఆయన కుటుంబ సభ్యులు ఐశ్వర్యపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి.
Read Also- Upasana: రెండో పెళ్లికి రెడీ అవుతోన్న ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్?
ఇదే అసలు సిసలైన ఫ్లాష్ బ్యాక్!
ఇప్పటి వరకూ.. ఫస్టాప్, సెకండాఫ్ మాత్రమే చూపించిన ఐశ్వర్య, సుజాత ఇప్పుడు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లారు. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పని చేస్తున్నది. అదే బ్యాంకుకు చెందిన మేనేజర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని విచారణలో నిగ్గు తేలింది. ఆ మేనేజర్ తల్లితోనే కాదు.. క్రమంగా కుమార్తె ఐశ్వర్యకు కూడా దగ్గరయ్యాడు. అలా ఇరువురి మధ్య అక్రమ సంబంధం ఏర్పడినట్లుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే తేజేశ్వర్‌తో పెళ్లి కుదరడం, అటు మేనేజర్ ఒప్పుకోకపోవడం.. ఐదురోజుల పాటు ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అని ప్లానింగ్స్.. చేసి ఓ నిర్ణయానికి వచ్చారట. అలా ఎలాగో ఐదు రోజుల మిస్సింగ్ తర్వాత పెళ్లి జరిగిపోయింది. అయితే పదే పదే ఫోన్‌లో మాట్లాడుతుండగా ఐశ్వర్యపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో అసలు విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఏకంగా తేజేశ్వర్‌ను చంపేయాలని ప్లాన్ చేశారు. అలా పెళ్లాయ్యాక ఐశ్వర్య- బ్యాంకు మేనేజర్ మధ్య 2వేల సార్లు ఫోన్ మాట్లాడుకున్నట్లుగా పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు.
అలా తీసుకెళ్లి.. ఇలా చంపేశారు!
ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలిగిస్తే భర్త ఆస్తి మొత్తం తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్లుగా సమాచారం. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం.. తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చాడు. ఆ గ్యాంగ్‌ను మానిటర్ చేయడానికి.. ఎప్పటికప్పుడు ఐశ్వర్యకు, తనకు సమాచారం అందించడానికి తన డ్రైవర్‌ను కూడా వారి వెంట పంపినట్టుగా తెలిసింది. తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో.. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్‌ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నట్లు, దాన్ని సర్వే చేయాలని చెప్పారు. పెళ్లి ఖర్చులు గట్టిగానే కావడంతో కాస్తో.. కూస్తో డబ్బులు వస్తాయని ఓకే చెప్పాడు. అలా ఐశ్వర్య భర్తను గద్వాలలో కారు ఎక్కించుకుని ఆ గ్యాంగ్ తీసుకెళ్లింది. కారు కదిలిన కొద్ది దూరం తర్వాత తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద ఆ గ్యాంగ్ పడేసింది. అటు కర్నూలు.. ఇటు గద్వాల పోలీసుల గాలింపు చర్యలతో కొన్ని రోజుల తర్వాత మృతదేహం లభించింది. కాగా.. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఐశ్వర్య, సుజాతలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
Read Also- IndiGo: వెళ్లి చెప్పులు కుట్టుకో.. ఇండిగో ట్రైనీ పైలట్‌పై కులవివక్ష!