Gadwal: సోనమ్ రఘువంశీ ఘటన తర్వాత కొత్తగా పెళ్లయినవాళ్లు హనీమూన్ అంటేనే భయపడుతున్నారు. పెళ్లి చేసుకునేవారు అన్ని వివరాలు ముందే తెలుసుకుని ముందుకెళ్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లయిన నెల రోజులకే దారుణ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భార్య ఉందని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
17 నుంచి మిస్సింగ్
గద్వాలలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్(33) జూన్ 17వ తేదీన మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. బంధువులు,స్నేహితువులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో గుర్తించారు.
ఈ మధ్యే పెళ్లి
తేజేశ్వర్‌కు సహస్ర అనే అమ్మాయితో ఈ మధ్యే వివాహం అయింది. వివాహానికి ముందు నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకే మనస్పర్ధలు నెలకొన్నాయి. తర్వాత మాటలు కలవడంతో గత నెల 17న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమ్మాయి బంధువులు, అబ్బాయి తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. నెల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఈ ఘాతుకం చోటు చేసుకుంటుందని ఊహించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. పెళ్లికి ముందే ఈ సంబంధం వద్దని వారించామని వాపోతున్నారు.
Read Also- Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం
సహస్ర వల్లే..
సహస్రకు పెళ్లికి ముందే వేరే వ్యక్తితో సానిహిత్యం ఉందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత పథకం ప్రకారం భూమి సర్వే చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేశారని అంటున్నారు. తేజేశ్వర్ లైసెన్సుడు సర్వేర్ కావడంతో భూమి సర్వే చేయాలంటూ కారులో ఎక్కించుకొని కావడ వెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో కత్తులతో చంపి మృతదేహాన్ని అక్కడే పారేశారు పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
సహస్రకు పెళ్లి ఇష్టం లేకనే ఈ కుట్రకు పాల్పడిందని తేజేశ్వర్ ఫ్యామిలీ అంటున్నది. సహస్ర, ఆమె తల్లి, ఒక బ్యాంక్, ఉద్యోగి ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్ హత్య జరిగిందని అతడి అన్న తెలిపాడు. కేసు విచారణలో భాగంగా గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కర్నూల్ చేరుకొని ఇరు కుటుంబాల వారిని విచారిస్తున్నారు. సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తూ సమాజంలో హుందాగా బతుకుతున్న తేజేశ్వర్, ఇష్టపడ్డ అమ్మాయిని వివాహం చేసుకొని నూతన జీవితం ప్రారంభించి ఇలా అకస్మాత్తుగా హత్యకు గురి కావడంతో స్నేహితులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.