Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu Kashmir) పహల్గామ్‌లో 26 మంది అమాయక భారతీయ పౌరులను పొట్టనపెట్టుకున్న నరమేధం (Pahalgam Attack) జరిగిన రెండు నెలల తర్వాత, కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, వారు ప్రయాణించడానికి సకల సౌకర్యాలు కల్పించిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేసింది. అరెస్టైన ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు పర్వైజ్ అహ్మద్ జోథర్. బషీర్ అహ్మద్ జోథర్‌గా గుర్తించినట్టుగా తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను కూడా నిందితులు వెల్లడించారని వివరించింది.
Read this- YS Jagan: జగన్.. రప్పా రప్పా అంటే ఇదేనా?
‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో కీలక పురోగతి లభించింది. 26 మంది అమాయక పర్యాటకులను చంపి, 16 మందిని తీవ్రంగా గాయపరిచిన భయంకరమైన నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. నిందితుడు పర్వైజ్ అహ్మద్ జోథర్ పహల్గామ్ పట్టణంలోని బాట్‌కోట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరో నిందితుడు బషీర్ అహ్మద్ జోథర్ పహల్గామ్‌లోని హిల్ పార్క్‌కు చెందినవాడు. ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల పేర్లు, గుర్తింపు వివరాలను వీళ్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఉగ్రవాదులు పాకిస్థానీ పౌరులని కూడా ధ్రువీకరించారు’’ అని ఎన్ఐఏ వివరించింది.
Read this- BRS Party: గులాబీ కోటలో కేసుల తంటా.. విచారణతోనే సరి
గుడిసెలో ఆశ్రయం
నిందితులు పర్వైజ్, బషీర్ ఏప్రిల్ 22న దాడికి ముందు హిల్ పార్క్‌లోని ఒక గుడిసెలో ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని ఎన్ఏఐ దర్యాప్తులో తేలింది. వారు ఉగ్రవాదులని తెలిసిన తర్వాతే ఆశ్రయం కల్పించినట్టు నిర్ధారణ అయ్యింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం అందించారు. అంతేకాదు, రవాణాకు ఏర్పాట్లు కూడా చేశారని వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజు ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్‌గా చేసుకున్నారని, మతాన్ని అడిగి మరీ చంపారని ఎన్‌ఐఏ మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడులలో ఇదొకటని ప్రకటనలో పేర్కొంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని సెక్షన్ 19 కింద ఈ ఇద్దరినీ అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వివరించింది. కాగా, ఏప్రిల్ 22న నలుగురు సాయుధ ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసరన్ లోయలోకి చొరబడి, పర్యాటకుల మతాన్ని నిర్ధారించుకొని కాల్పులకు తెగబడ్డారు. హిందూ పురుషులను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో తుపాకీలతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట మే 7న పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు చచ్చిపోయారు. అయితే, మరుసటి రోజు పాకిస్థాన్ కూడా ప్రతీకార దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పులకు విరమణ పలుకుదామంటూ మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత ప్రతినిధిని అభ్యర్థించడంతో భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే.