BRS Party: బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపడుతుండగా, కీలక నేతలంతా కేసులు, విచారణ పేరుతో నిత్యం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం ఉండడం లేదు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ వెనుకబడిందని ఆ పార్టీలోనే అభిప్రాయపడుతున్నారు.
విమర్శలకు పదును
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లేందుకు విమర్శలకు పదును పెట్టింది. అయితే నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మరో వైపు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారని సర్కార్ సైతం సీరియస్‌గా ఉంది. అయితే, నేతల దూకుడును అడ్డుకునేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని, ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వైఫల్యాలపై మాట్లాడడంతో పాటు వాయిస్ పెంచడంతో ప్రభుత్వం సైతం అదే స్థాయిలో దూకుడు పెంచింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినా, మీడియా ముందు విమర్శలు చేసినా కేసులకు ఉపక్రమిస్తుంది. అంతేకాదు గులాబీ పార్టీలోని నేతలపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎవరైనా నిరాధారంగా మాట్లాడుతున్నారని గమనిస్తూ వారిపై నోటీసులు ఇస్తుంది. పార్టీలోని కీలక నేతలనుంచి కింది స్థాయిలో నాయకుల వరకు ఎవరిని కాంగ్రెస్ పార్టీ వదలడం లేదు. పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తుంది.
కేటీఆర్‌పైనే 15 కేసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనే 14పైగా కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో కీలకంగా ఫార్మూలా ఈకారు రేసు కేసు. నిధులు దారి మళ్లీంచారనే అభియోగంతో ఏసీబీ విచారణ చేపడుతున్నది. చివరికి హరీశ్‌రావు, కేటీఆర్ డీపీలు పెట్టుకొని పోస్టులు పెట్టినా కూడా కేటీఆర్, హరీశ్‌రావులపైనే కేసులు నమోదు చేయిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హరీశ్‌రావు పైనా 10వరకు అక్రమ కేసులు నమోదు అయ్యాయని, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై 29కి పైగా కేసులు, మన్నె క్రిశాంక్‌పై 15 కేసులు, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై 25 కేసులు, ఇక బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సైనికులపై ఎక్కడో ఒకచోట రోజుకో కేసు నమోదవుతూనే ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నారు. మరోవైపు కాళేశ్వరం విచారణ పేరుతో కాళేశ్వరం కమిషన్ సైతం గులాబీ అధినేత కేసీఆర్ తో పాటు హరీశ్ రావుకు సైతం నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
విచారణలకే పరిమితమైన బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్‌లో ముఖ్య నేతలు నమోదైన కేసులతో వాటి విచారణకే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నారని నేతలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఫోకస్ పెట్టి వాటిని తెలికి తీయడంతో పాటు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతుంది. మరోవైపు హస్తం పార్టీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. దీంతో ఆ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంతోనే బీఆర్ఎస్ పార్టీకి సరిపోతుంది. హస్తం పార్టీ వేసే స్కెచ్‌లో పడి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లలేకపోతున్నారని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు భయం
ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిపై వరుస కేసులు నమోదు అవుతుండడంతో గులాబీ నేతలు జంకుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, ఎమ్మెల్సీ స్థాయి నేతలు మాత్రమే కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మిగిలిన నేతలు ఎవరు ఆ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సాహసించడం లేదు. గ్రామస్థాయిలో సైతం బీఆర్ఎస్ నేతలు కొంత సైలెంట్ అయ్యారని సమాచారం. మండల స్థాయి నేతలు సైతం ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలపై మాట్లాడడం లేదని పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
Read Also- Telangana: దివ్యాంగుల సంక్షేమం.. సర్కారు సరికొత్త వ్యూహం
పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షసాధింపు
పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును శనివారం ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండించారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.
నియంత పాలనపై పోరాడుతాం
గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు అన్నారు. ఈ ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నండటంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసుపాలవుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలనపై, బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also- Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే