Gold Price Hike: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రంగం ప్రవేశం చేయడంతో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి. దీంతో మధ్య ప్రాచ్యం (Middle East)లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇంధన ధరలపై ఒక్కసారిగా ఆందోళన మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆసియా మార్కెట్లలో (Asian Trading Markets) సోమవారం ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరోవైపు యుద్ధం ఎఫెక్ట్ తో పసిడి ధరల్లో సైతం పెరుగుదల చోటుచేసుకుంది.
ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువలో
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. ఆసియా మార్కెట్లలో పసిడి ధరలు ప్రభావితమయ్యాయి. బంగారం ధరల్లో 0.8% మేర పెరుగుదల చోటుచేసుకుంది. ఫలితంగా లాభాల్లో కోత పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌లో ఉదయం 7:47 గంటల సమయానికి ఒక ఔన్స్ గోల్డ్ 0.2% పెరిగి 3,375.04 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఏప్రిల్ లో అందుకున్న ఆల్ టైమ్ గరిష్ట స్థాయి విలువకు ప్రస్తుతం 125 డాలర్ల దూరంలో పసిడి ఉంది. ఉద్రిక్తతలు ఇదే స్థాయిలో కొనసాగితే ఆల్ టైమ్ రికార్డును దాటి కూడా పసిడి దూసుకెళ్లే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పసిడి పెరుగుదలకు కారణాలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడింది. దీంతో అస్థిరమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు. ఎంతో సురక్షితమైన బంగారంపై ఇన్ వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీని వల్ల రానున్న రోజుల్లో బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ అనంతరం.. బంగారం ధరలు 1.65% మేర పెరగడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అంతేకాదు బంగారం ధర.. డాలర్ తో ముడిపడి ఉన్నందున.. డాలర్ పెరిగిన ప్రతీసారి పసిడి కూడా పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నట్లు వివరించారు. పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి ఛాన్స్ అని వారు అభిప్రాయపడుతున్న పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో 30% పెరుగుదల
2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకూ చూస్తే అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు 30% మేర పెరిగినట్లు తెలుస్తోంది. అయితే గోల్డ్ నిరంతర పెరుగుదల.. ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చన్న భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేటులో కోత విధించడం లేదా తగ్గించేలా.. పసిడి ధరల నిరంతర పెరుగుదల ఒత్తిడి చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: BJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!
ఆశలు వదులుకోవాల్సిందే!
అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత్ పై కూడా కచ్చితంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం.. లక్షకు చేరువకావడంతో సామాన్యులు కొనలేక అవస్థలు పడుతున్నారు. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగి.. పసిడి ధరలు పెరిగితే బంగారంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ ఆసియా మార్కెట్లలో పసిడి ధరలు పెరిగినప్పటికీ.. భారత్ లో ఇందుకు భిన్న పరిస్థితులు కనిపించాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రూ.50 రూపాయల మేర తగ్గి.. రూ.92,350 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. రూ.60 పెరిగి రూ.1,00,750 చేరింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,300 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో కూడా రూ.92,300 ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ను హైదరాబాద్, విజయవాడ నగరాల్లో రూ. 1,00,750కు విక్రయిస్తున్నారు.