Medchal: మేడ్చల్ పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కాల్వలపై వంతెనలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతి వర్షాకాలంలో రాకపోకలకు బ్రేక్ పడుతుంది. ఒక్కోసారి రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిస్తే నాలుగైదు రోజులకు కూడా రోడ్లు బంద్ అవుతున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు, కిష్టాపూర్ రోడ్డు నుంచి రావల్‌కోల్ గ్రామానికి వెళ్లే రోడ్డు, పూడూరులో నల్సార్‌కు వెళ్లే రోడ్లు వర్షాకాలంలో నీరు ప్రవహించి, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
వంతెనలు నిర్మించరా?
దాదాపు పదేళ్ల నుంచి వరుసగా వర్షాలు దంచి కొడుతుండటంతో నాలుగు దారుల్లో రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో మూడు నుంచి ఐదు రోజుల వరకు రోడ్లను మూసివేయాల్సి వస్తుంది. మేడ్చల్ నుంచి గౌడవెల్లికి జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లితో పాటు దుందిగల్, గండిమెసమ్మ, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ తదితర ప్రాంతాలకు పాత పట్టణం నుంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. వర్షాలు పడితే పెద్ద చెరువులోకి పై నుంచి వరద నీరు వస్తోంది.
Also Read: Kodanda Reddy: రైతు బిడ్డ సీఎం.. కోదండ రెడ్డి సంచలన వాఖ్యలు!
యువకులు రోడ్డు దాటేందుకు ప్రయత్నించి, ప్రమాదాల బారిన పడుతున్నారు
ఆ వరదతో నీరు రోడ్డుపై నుంచి నీరు ప్రవహించి జనజీవనానికి ఆటంకం కలుగుతుంది. నీళ్లు వచ్చినప్పుడు ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. యువకులు రోడ్డు దాటేందుకు ప్రయత్నించి, ప్రమాదాల బారిన పడుతున్నారు. రాకపోకలు ఆటంకం ఏర్పడితే ప్రయాణానికి దూరాభారం మోయాల్సి వస్తుంది. అలాగే మేడ్చల్-కిష్టాపూర్, కిష్టాపూర్-రావల్‌కోల్, పూడూరు-నల్సార్ రోడ్లు వర్షాలతో రాకపోకలు నిలిచితే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రజలు ఏండ్ల నుంచి ఆయా దారుల్లో ఇబ్బందులు పడుతున్నా పాలకులకు వంతెనలు నిర్మించాలన్నా ఆలోచన రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరానికి అతి దగ్గరగా ఉన్న మేడ్చల్‌లో వర్షాకాలంలో రాకపోకలు బంద్ కావడమేమిటో అర్థం కావడం లేదన్నారు. పాలకులు, అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
వంతెనల నిర్మాణంపై దృష్టి సారించాలి: శ్రీశైలం యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు
మేడ్చల్ మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షాకాలంలో రాకపోకలు బంద్ అవుతున్నాయి. మేడ్చల్-కిష్టాపూర్, మేడ్చల్-కిష్టాపూర్, కిష్టాపూర్-రావల్‌కోల్ దారుల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆయా దారుల్లో రాకపోకలు బంద్ అయితే ఆగిపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం తప్పించి, వేరే ఆలోచనలు పాలకులు చేయకపోవడం శోచనీయం. ఇప్పటికైనా వంతెనల నిర్మాణంపై దృష్టి సారించాలి.
Also Read: Telangana Government: ఆటో రిక్షా కార్మికులకు.. ప్రభుత్వం గుడ్ న్యూస్!