Tragedy News: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతుర్లను ఓ మాజీ సైనికుడు అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని వెనాచీ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ట్రావిస్ డెక్కర్ (Travis Decker) ఈ ఘోరానికి ఒడిగట్టాడు. దీంతో అతడిపై మాజీ భార్య విట్నీ డెక్కర్ న్యాయ పోరాటానికి దిగింది. అయితే పోరాటంలో ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఆమె ‘గోఫండ్‌మీ’ క్యాంపెయిన్ ను ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే?
ఈ ఏడాదిలోనే భార్య విట్నీ డెక్కర్ (Whitney Decker) తో ట్రావిస్ డెక్కర్ విడాకులు తీసుకున్నాడు. అయితే ఆ జంటకు అప్పటికే పైటిన్ (9), ఎవెలిన్ (8), ఒలివియా (5) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. దీంతో బాలికల పర్యవేక్షణను తల్లికి అప్పగించిన న్యాయస్థానం.. అప్పుడప్పుడు తండ్రిని కలుసుకునేందుకు వీలు కల్పించింది. ఈ క్రమంలో మే 30న తండ్రిని కలిసేందుకు ముగ్గురు బాలికలు వెళ్లగా.. వారు తిరిగి రాలేదు. దీంతో అనుమానించిన విట్నీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మృతదేహాల గుర్తింపు
విట్నీ డెక్కర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తండ్రి ట్రావిస్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో జూన్ 2న చెలన్ కౌంటీలోని రాక్ ఐలాండ్ క్యాంప్ గ్రౌండ్ వద్ద అతడి ట్రక్ కనిపించింది. ఆ ట్రక్ సమీపంలో పోలీసులు గాలించగా.. ముగ్గురు బాలికల మృతదేహాలు బయటపడ్డాయి. బాలికల చేతులు తాళ్లతో కట్టబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగ్ ను తలకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు ప్రాథమికంగా పోలీసులు కనుగొన్నారు. ఈ పని చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి ట్రావిస్ డెక్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: June 6th Holiday: రేపు హాలీడే అంటూ జోరుగా ప్రచారం.. అందులో వాస్తవమెంతా!
‘గోఫండ్‌మీ’కి భారీ రెస్పాన్స్!
అల్లారు ముద్దుగా పెచ్చుకుంటున్న ముగ్గురు కుమార్తెలు తన మాజీ భర్త వల్ల హత్య గురికావడాన్ని తల్లి విట్నీ డెక్కర్ తట్టుకోలేకపోతోంది. అతడ్ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని భీష్మించుకొని కూర్చుంది. ఈ క్రమంలో న్యాయ ఖర్చులకు సరిపడ డబ్బు లేకపోవడంతో ఆమె విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్నేహితురాలు అమీ ఎడ్వర్డ్స్ సాయంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గోఫండ్‌మీ’ (GoFundMe)లో పేజీని క్రియేట్ చేసి లీగల్ ఖర్చుల కోసం ప్రజల సాయం కోరుతోంది. అయితే ఆమె చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. దాదాపు 10 వేల మంది.. 5 లక్షల డాలర్ల వరకూ ఆర్థిక సాయం చేశారు.