BCCI, RCB on Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ (IPL 2025) గెలుపొందిన నేపథ్యంలో బుధవారం చేపట్టిన విజయోత్సవ వేడుక విషాదాంతమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ ప్లేయర్లకు బెంగళూరు (Bengalore Stampede) నగరంలోని ఎం.చినస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తీవ్ర తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా అభిమానులు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Franchise), బీసీసీఐ (BCCI) తొలిసారి స్పందించాయి.
ఆర్సీబీ రియాక్షన్ ఇదే
చినస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ స్పందించింది. ఐపీఎల్ ట్రోఫీ కోసం ఆర్సీబీ అభిమానులు ఏకంగా 18 సంవత్సరాలు ఎదురుచూశారని, కానీ, దురదృష్టకర పరిస్థితికి గురైన ఫ్యాన్స్ పట్ల అందరూ సానుభూతి తెలపాలంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు తొక్కిసలాట ఘటన తర్వాత ఆర్సీబీ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, తొక్కిసలాట విషాదం నేపథ్యంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయాన్ని కుదించారు. నిర్దేశిత సమయం కంటే ముందుగానే సన్మాన కార్యక్రమాన్ని ముగించారు. ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట తర్వాత ఆర్సీబీ సన్మాన కార్యక్రమ సమయాన్ని కుదించామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.
Read this, RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత
మెరుగ్గా ప్లాన్ చేయాల్సింది: బీసీసీఐ కార్యదర్శి
ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల కోసం నిర్వాహకులు మెరుగ్గా ప్లాన్స్ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. భద్రతా లోపాలు బయటపడ్డాయన్నారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘‘ ఇది చాలా దురదృష్టకరం. జనాధరణకు ఉండే ప్రతికూల కోణం ఇది. వారికి ఇష్టమైన క్రికెటర్ల పట్ల అభిమానులు అభిమానంతో ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు మెరుగ్గా ప్లాన్ చేయాల్సింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సైకియా చెప్పారు.
Read this, Census 2027 Schedule: జనాభా లెక్కలకు ముహూర్తం ఫిక్స్!
బీసీసీఐకి సంబంధం లేదు: ఐపీఎల్ చైర్మన్
చినస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చేపట్టాల్సిన దర్యాప్తు జరుపుతామని, సంబంధిత అధికారులు విచారణ చేపడతారని వివరించారు. ఈ సన్మాన కార్యక్రమంతో బీసీసీఐకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ‘‘ ఇది దురదృష్టకరమైన ఘటన. విజయోత్సవ వేడుకలు విషాదంగా మారాయి. ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే విజయోత్సవ కార్యకలాపాలను ముగించాలని నిర్వాహకులను ఆదేశించామని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ‘‘ ఆర్సీబీ విక్టరీ వేడుక ప్రణాళిక ప్రకారం జరిగిందా?, ప్రణాళిక లేదా? అనేది తెలియరాలేదు. అభిమానులు రావాలా లేదా?, వారే స్వయంగా వచ్చారా అనేది కూడా నాకు తెలియదు. నేను ఆర్సీబీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, స్టేడియం లోపల బాగా రద్దీ ఉందని చెప్పారు. బయట ఏం జరుగుతుందో బహుశా వారికి తెలియదేమో. త్వరగా ఈవెంట్‌ను ముగించాలని కోరగా, అందుకు హామీ ఇచ్చారు’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.
Read this, Vennupotu Dinam: వైసీపీ చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ హిట్టా.. ఫట్టా?