RCB Parade Stampede: ఏకంగా 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ ట్రోఫీని (IPL 2025) ముద్దాడడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. జోరుగా, హుషారుగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, ఆనందోత్సాహాల నడుమ బెంగళూరు నగరంలో ఆర్సీబీ ప్లేయర్లు ఇవాళ (బుధవారం) విక్టరీ పరేడ్‌లో పాల్గొనబోతున్నారు. ఊరేగింపుగా నగరంలోని చినస్వామి స్టేడియానికి చేరుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అయితే, ఈ క్రమంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
చినస్వామి స్టేడియానికి సమీపంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 11 మంది అభిమానులు చనిపోయారు. 50 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది వరకు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ అపశృతి చోటుచేసుకోవడం కలచివేస్తోంది. చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. గాయపడిన అభిమానులను పోలీసులు హుటాహుటిన హాస్పిటల్స్‌కు తరలిస్తున్న దృశ్యాలు ఘటనా స్థలంలో కనిపించాయి.
డిప్యూటీ సీఎం క్షమాపణలు..
ఆర్సీబీ అభిమానులతో బెంగళూరు నగర వీధులు, చినస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోవడంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. అభిమానుల రద్దీ నియంత్రించలేని స్థాయిలో ఉందని విచారం వ్యక్తం చేశారు. విపరీతమైన రద్దీ పరిస్థితులకు తాను నగర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. 5,000 మందికిపైగా పోలీసులు, అధికారులను విధుల్లో మోహరించామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని, యువతపై తమ ప్రభుత్వం లాఠీని ప్రయోగించబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్సీబీ విజయం పట్ల గర్వంగా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Read this, EPFO Withdraw: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పండుగ లాంటి శుభవార్త!
గోడలు దూకి స్టేడియంలోకి..
ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అభిమానుల కోసం స్టేడియం వరకు విక్టరీ పరేడ్ చేపట్టాలని ఆర్సీబీ టీమ్ నిర్ణయించింది. ఈ నైపథ్యంలో అభిమానులు భారీగా పోటెత్తారు. చాలామంది అభిమానులు గోడలు దూకి స్టేడియంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. స్టేడియం వెలుపల ఉండే గోడలు, ఇనుప కంచెలు ఎక్కి స్టేడియంలోకి ప్రవేశించేందుకు చాలామంది ఫ్యాన్స్ ప్రయత్నించారు. అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ పోలీసులు విన్నవించినా పెడచెవినపెట్టారు. స్టేడియం పరిసరాలను వీడి వెళ్లాలని కోరినా పట్టించుకోకపోవడంతో రద్దీ మరింత పెరిగిపో ఈ తీవ్ర విషాదానికి దారితీసింది.
Read this, Virat Kohli: ఐపీఎల్‌లో ఫస్ట్ ట్రోఫీ.. కెప్టెన్‌కు కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్.. వీడియో వైరల్!