Complaints To Hydraa: నాలాల ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కూడా హైడ్రా ప్రజావాణికి 23 ఫిర్యాదులందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 70 శాతం నాలాల సమస్యలపైన ఫిర్యాదులున్నట్లు వెల్లడించారు. మిగతావి ఎప్పటిలాగే రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపైన ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, తిరుమలగిరి, భూదేవినగర్‌లోని సాయిదత్తా గార్డెన్స్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలం కబ్జా అయ్యిందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2004లోనే జీహెచ్ ఎంసీకి ఆ స్థలాన్ని ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరినా, ఫలితం లేకపోయిందని వాపోయారు.
శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ విలేజ్‌లో 11/20, 11/21 సర్వే నంబర్లలో 1983లో గురుకుల ట్రస్టు లే ఔట్ వేశారు. అందులోని ప్లాట్లతో పాటు, రహదారులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. వర్షాకాలం కావడంతో నాలాల కబ్జాల ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి పెట్టినా,ఎప్పటిలాగే కొన్ని జనరల్ ఫిర్యాదులను కూడా స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలోని చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నాలా కుంచించుకుపోవడంతో బృందావన్ అపార్టుమెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోందని, 2020 సంవత్సరంలో వరదలకు సెల్లార్ నీట మునిగిందని, ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందిగా పరిణమిస్తోందని, ఇక్కడి నాలా పొంగి నివాస ప్రాంతాల్లోకి వరద నీరుచేరకుండా చూడాలని అపార్టుమెంటు నివాసితులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: ఇంట్లో ఈటెల రాజేందర్ రెడ్డి.. గేట్ బయట ఓబీసీ నాయకుడు!
రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మన అందరం కలసి పని చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎన్నో కలలు గని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాంమని, కలలు సాకారం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు.
హైడ్రా కార్యాలయం ముందు జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రంగనాథ్ మాట్లాడుతూ ఔటర్ రింగు రోడ్డు వరకూ పరిధిని నిర్దేశించి హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,చెరువులు, నాలాలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండేలా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. ఆ దిశగా అందరూ కలసి పని చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గీతం చాటి చెబుతోందని, ఆ లక్ష్యాలు నెరవేరేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు.
Also Read: GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?