Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈనెల 5న ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయిన విషయం తెలిసిందే. పద్నాలుగు నెలలుగా అమెరికాలోనే ఉంటున్న ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి వీలైన అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో విచారణకు సహకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు కొట్టి వేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది.
దాంతో తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే, దీనిని అమెరికా ప్రభుత్వం తోసి పుచ్చింది. అదే సమయంలో అమెరికా హోం ల్యాండ్స్ ఏజన్సీ అతన్ని భారత్ కు డిపోట్ చేసే దిశగా చర్యలు చేపట్టింది. దాంతో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర ఊరటను కల్పించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Also Read: Ponguleti srinivas: రెవెన్యూ వ్యవస్ధలో మరో ముందడుగు.. ప్రజల వద్దకే అధికారులు!
అదే సమయంలో రద్దు చేసిన ప్రభాకర్ రావు పాస్ పోర్టును పునరుద్దరించి ఆయనకు అంద చేయాలని కేంద్రానికి సూచించింది. కానిపక్షంలో ఎమర్జన్సీ ట్రావెల్ ఎగ్జిట్ ఆర్డర్ ఇవ్వాలని పేర్కొంది. ఇది చేతికందిన మూడు రోజుల్లోగా స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలంటూ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత్ ఎంబసీ అధికారులు ప్రభాకర్ రావుకు ఎమర్జన్సీ ట్రావెల్ ఎగ్జిట్ ను కల్పించారు. దాంతో ఆయన సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు.
కేసు టైం లైన్ …
2024, మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. v ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు ఇతర నిందితులను విచారించిన అనంతరం 2024, ఏప్రిల్ 29న ప్రభాకర్ రావును కేసులో నిందితునిగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. 2024, జూన్ 10న కేసులో మొదటి ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. 2024, జూలై 15న ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2025, మార్చి 3న ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. దీనికి కొన్ని రోజుల ముందే పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆయన పాస్ పోర్టును రద్దు చేసింది.
తన పాస్ పోర్టును రద్దు చేయటాన్ని సవాల్ చేస్తూ ప్రభాకర్ రావు 2025, ఏప్రిల్ 10న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇక, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మే 5న కొట్టివేసింది. ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు మే 29న ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించింది.
కేసు తదుపరి విచారణ జరిగే ఆగస్టు 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. రద్దు చేసిన పాస్ పోర్టును పునరుద్దరించి ప్రభాకర్ రావుకు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. లేనిపక్షంలో ఎమర్జన్సీ ఎగ్జిట్ ట్రావెల్ ఆర్డర్ ఇవ్వాలని పేర్కొంది. ఇది చేతికందిన మూడు రోజుల్లోగా భారత్ కు వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఈ మేరకు అండర్ టేకింగ్ లెటర్ ను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.
Also Read: Thug Life Trouble: ‘థగ్ లైఫ్’పై నిషేధం.. హైకోర్ట్ మెట్లెక్కిన కమల్.. ఊరట లభించేనా!