Ponguleti srinivas: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం రెవెన్యూ వ్యవస్ధను దుర్వినియోగపరచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి వ్యవస్దను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
మొదటి దశలో 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించగా, ఆ తర్వాత మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఇక జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
Also ReadL: CM Revanth Reddy: ఎకో టౌన్ మోడల్ తో సీఎం ప్రేరణ.. ముసీ నదీ పునరుజ్జీవనంపై ఫోకస్!
అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్తుందన్నారు.ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారు. ఇప్పటి వరకు వచ్చిన 42 వేల దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసి 60 శాతం భూ సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
Also Read: IAS officer Alugu Varshini: వివాదాలకు కేరాఫ్‌గా ఐఏఎస్ అధికారిణి.. వర్షిణీపై ఎస్సీ కమిషన్ సీరియస్!
భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను (జి.పి.ఓ.) అతి త్వరలో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని ప్రకటించారు. గ్రామ పాలన అధికారుల 10,954 పోస్టుల భర్తీకి జి.ఓ. విడుదల చేయగా 5వేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మండి అభ్యర్థులు హాజరు కాగా తుది మెరిట్ జాబితాలో 3,550 మండి అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారు.
అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. తరతరాలుగా నక్షా లేని 413 గ్రామాలలో పునఃసర్వే నిర్వహించబోతున్నామన్నారు. ఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా టీజీఆర్‌ఏసీ ( తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్ కు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇందుకు సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.
Also Read: Rajamouli on Shreyas Iyer: శ్రేయాస్ కోసం జక్కన్న.. బీసీసీఐకి సూటి ప్రశ్న.. జస్ట్ ఆస్కింగ్!