Corporators: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు పదవీ కాలం ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఉండటంతో చివరి నిమిషం వరకు అందినంత దండుకునేందుకు కార్పొరేటర్లు సిద్దమైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భర్తలు కార్పొరేటర్లు కాగా, వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, వీరిలో నాలుగు కార్పొరేటర్ల సీట్లు ఖాళీగా ఉండగా, మిగిలిన మొత్తం 146 మంది కార్పొరేటర్లలొ 60 మందికి పై చిలుకు మహిళా కార్పొరేటర్లున్నారు. మహిళా కార్పొరేటర్లు కేవలం కౌన్సిల్ మీటింగ్ కు, సర్కిళ్ల వారీగా ఏదైనా సమీక్ష సమావేశం జరిగినపుడు మాత్రమే కార్పొరేటర్ గా ఫీలవుతారు.
కానీ వారి భర్తలు మాత్రం రౌండ్ ది క్లాక్ నేనే కార్పొరేటర్ అన్నట్టు వ్యవహారిస్తూ, ప్రజాసేవకులమని చెబుకుంటూనే, ప్రజల రక్తం తాగుతున్నారన్న విమర్శలున్నాయి. గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఎక్కడ ఇంటి నిర్మాణ పనులు మొదలుపట్టగానే కలెక్షన్ ఏజెంట్లు వచ్చి వాలుతున్నారు. అన్న రమ్మాన్నారంటూ పిలిపించుకుని నిర్మాణం చేపడుతున్న స్థల విస్తీర్ణం, నిర్మించనున్న అంతస్తుల సంఖ్యను బట్టి ప్రతి ఫ్లోర్ కు రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు, అడిగినంత ఇవ్వని భవన యజమానులను టార్గెట్ చేసి, టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో ముగ్గురి కార్పొరేటర్ల ఆగడాలు బయటపడి జీడిమెట్ల, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, తాజాగా బోరంబండ లో కార్పొరేటర్ ఆగడాలు బయటపడ్డాయి. కార్పొరేటర్ల వేధింపులు, వసూళ్లు లేని డివిజన్ సిటీలో లేదంటే ఆశ్చర్యమేమీ లేదనే చెప్పవచ్చు.
Aslo Read: Sabitha Indra Reddy: 2వేల ప్రభుత్వ స్కూళ్ల ను మూసేశారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
కార్పొరేటర్ పై కేసు
తాజాగా బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ వేధింపులు భరించలేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ నేత మహ్మద్ సర్ధార్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను చేరిన కాంగ్రేస్ పార్టీలో చేరాలని కొంతకాలం బాబా ఫసియుద్దిన్ సర్దార్ ను వేధిస్తున్నట్లు తెలిసింది. బోరబండలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న సర్దార్ ఇటీవలే తాను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో జీ ప్లస్ త్రీ ఫ్లోర్ ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. అయితే తాను చెప్పిన విధంగా తాను ఉన్న పార్టీలో చేరలేదన్న కక్షతో బాబా ఫసియుద్దిన్ సర్దార్ నిర్మించిన ఇంటికి జీహెచ్ఎంసీ అనుమతి లేదని, అక్రమంగా పైన పెంటౌజ్ నిర్మించావని సర్దార్ ను బెదిరించటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సర్దార్ బుధవారం భవనంపై ఎక్కి, దూకి, స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతుడి సోదరుడు మహ్మద్ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ పై సెక్షన్లు బీఎన్ఎస్ 108 కింద కేసు నమోదు చేశారు. ఇదెలా ఉండగా, ఇటీవలే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇంటిని నిర్మించుకుంటున్న ఓ యజమానిని పిలిచి కార్పొరేటర్ రూ.లక్షల్లో లంచం డిమాండ్ చేయటంతో యజమాని అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేని యజమానిని తరుచూ వేధించటంతో ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూడా జరిగింది. ఈ రకంగా కార్పొరేటర్ల కాసుల కక్కుర్తికి సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుని బలవుతుంటే కనీసం వారికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చి ప్రజలపై ఉసి గొల్పిన పార్టీల అధిష్టానాలు మందలించిన పాపాన పోలేదు. అంటే రాజకీయమంటే ప్రజలను దోచుకోమని పరోక్షంగా పార్టీలు చెబుతున్నాయా? అన్నది బోరబండ ఘటనతో హాట్ టాపిక్ గా మారింది. లంచాల కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనకాడని ఇలాంటి అక్రమార్కులైన నేతలు, ప్రజాప్రతినిధులు మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తే గుణపాఠం నేర్పేందుకు ఓటర్లు సిద్దం కావాలన్న చర్చ జరుగుతుంది.
Also Read: MLA Raja Singh: సొంత పార్టీపైనే రాజాసింగ్.. సంచలన కామెంట్స్!
ఈయనకు సిటీ వ్యాప్తంగా వసూళ్ల సైన్యం
కొందరు కార్పొరేటర్లు, మరికొందరు కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలోని నిర్మాణాలు చేపట్టే ఇంటి యజమానులను, కాంట్రాక్టర్లను, వ్యాపారులను వేధింపులకు గురి చేస్తుంటే, మరో కార్పొరేటర్ భర్త గ్రేటర్ అంతా నా అడ్డా అంటూ రెచ్చిపోతున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలిలో ఓ పెద్దగా, బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న మహిళా కార్పొరేటర్ భర్త ఇతర కార్పొరేటర్ల కన్నా ఒక అడుగు ముందుకేసి మొత్తం గ్రేటర్ లో హవా చెలాయిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో సదరు కార్పొరేటర్ కు కేటాయించిన ఛాంబర్ లో ఎపుడూ చూసిన ఆమె భర్తే దర్శనమిస్తుంటారు.
ఆయన గ్రేటర్ హైదరాబాద్ లోని 30 సర్కిళ్లలో నిర్మాణాలను గుర్తించి, లంచాలు వసూలు చేసేందుకు మొత్తం 15 మంది సైన్యాన్ని నియమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సదరు కార్పొరేటర్ డ్రైవర్ సైతం వసూళ్లను వదలటం లేదు. ఇటీవలే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం ఆబిడ్స్ జీహెచ్ఎంసీ ఆఫీసులో ఓ కార్పొరేటర్ ఓ నిర్మాణానికి సంబంధించి ఏకంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై దాడి చేసిన ఘటన కూడా జరిగింది. ఈ వ్యవహారంలో ఉభయ వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా, కార్పొరేటర్ల ప్రవర్తనలో మార్పు రాకపోవటం గమనార్హం.
Also Read: MLC Kavitha: సింగరేణి సాక్షిగా కొత్త పార్టీ.. కవిత మాస్టర్ ప్లాన్ భేష్.. వర్కౌట్ అయ్యేనా?