Arunachal Pradesh: భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి దానికి ప్రతీగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో రెండు దేశాల మధ్య మినీ యుద్ధమే జరిగింది. పాక్ తో జరుగుతున్న దాడి ప్రతీదాడులతో గత కొన్ని రోజులుగా భారత సైన్యం బిజీ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా వక్రబుద్ధి కలిగిన పాక్ పై అనుమానంతో ఇప్పటికీ మన సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగానే ఉంది. ప్రస్తుతం భారత్ ఫోకస్ పాక్ పై ఉండటంతో గుంట నక్క చైనా సందిట్లో సడేమియాలాగా ఓవరాక్షన్ చేయబోయింది. దీనికి భారత్ ఘాటైన సమాధానం ఇచ్చింది.
పాక్ తో ఉద్రిక్తతలతో కేంద్రం ప్రభుత్వం, సైన్యం బిజీగా ఉన్న వేళ.. చైనా తన కుటిల నీతిని మరోమారు బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. చైనా చేసే కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ ను తమ భూభాగంగా భావిస్తున్న చైనా.. ఆ రాష్ట్రంలోని ప్రాంతాలను జాంగ్ నాన్ లేదా దక్షిణ టిబెట్ గా చెప్పుకుంటోంది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ మాట్లాడుతూ చైనా వైఖరిని తప్పుబట్టారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము గుర్తించామని అన్నారు. ఇందుకు భారత్ పూర్తి విరుద్ధమన్న ఆయన.. దీనిని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని చైనాకు మరోమారు విదేశాంగ ప్రతినిధి తేల్చి చెప్పారు. అరుణాచల్ కు భారత్ తో విడదీయరాని బంధముందని.. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవ పరిస్థితులను ఎవరూ మార్చలేరని చెప్పారు. ‘మీ ఇంటి పేరు మార్చినంత మాత్రాన ఇల్లు నాది అవుతుందా?’ అని నిలదీశారు. అరుణాచల్ ప్రదేశ్ దేశంలో ఒక రాష్ట్రంగా ఎల్లప్పుడూ ఉంటుందని చైనాకు తేల్చి చెప్పారు. ఇది ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాలని చాలా స్పష్టంగా చెబుతున్నట్లు రణదీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Also Read: Sudigali Sudheer: అదిరిపోయే న్యూస్ చెప్పిన సుధీర్ ఫ్యామిలీ.. త్వరలో మనకి పరిచయం చేయబోతున్నాడా?
ఇదిలా ఉంటే చైనాకు సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ లో 50 వరకూ ప్రాంతాలు తమవిగా చైనా పేర్కొంటూ వస్తోంది. వాటికి చైనీస్, టిబెటెన్ పేర్లను సైతం పెడుతోంది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉన్న ప్రాంతాల పేర్లను మారుస్తూ గతంలోనే చైనా నాలుగు జాబితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా 2017లో విడుదల చేసిన తొలి జాబితాలో 6 ప్రదేశాలకు పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ క్రమంలోనే 2023లో 11, గతేడాది మరో 30 ప్రాంతాలకు పేర్లను మారుస్తూ చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిని ప్రతీసారి భారత్ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది.