Hydra: పార్కులు, రహదారులు, ప్రజావసరాలకోసం ఉద్దేశించిన స్థలాలను కాపాడాల్సిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే వాటిని చెరబడుతున్నారన్న విషయం హైడ్రాకు అందిన ఫిర్యాదులతో స్పష్టమైంది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను వ్యాపారులకు దారాదత్తం చేయడం, ప్లాట్లుగా పత్రాలు సృష్టించి అమ్మేయడం వంటివి చేస్తున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదులందాయి. బస్తీ, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులుగా చెలామణి అవుతూ ఇందుకు తెగబడుతున్న విషయం కూడా రుజువైంది.
ప్రజావసరాలకు ఉద్దేశించినవిగా లే అవుట్ లలో స్పష్టంగా పేర్కొన్నా, వాటిని ఏదో ఒక రూపంలో అమ్మేస్తున్నారంటూ ఫిర్యాదుదారులు వాపోతున్నారు. కాలనీ నివాసితులకు వాటిపై హక్కు లేకుండా చేస్తున్నారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సర్వే నంబరు 181, 183 పరిధిలోని సాయిలక్ష్మి లే అవుట్లోని 1800ల గజాల పార్కు స్థలం కబ్జా అయ్యిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Crime News: పట్టపగలే హత్య.. ప్లాన్ చేసి హతమార్చిన నిందితులు!
ఇదే కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబరు 153, 154, 155లో కూడా దాదాపు 5 ఎకరాల వరకూ ఉన్న పార్కుస్థలాలు, రహదారులు కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే 2,3 ఎకరాల వీఎన్ ఆర్ పార్కు స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని ఫిర్యాదు అందింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలే కాదు, ఆఖరకు కాలనీ లే అవుట్ లోని స్థలాలను కూడా వదలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీకరించడమే గాక, గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడి పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు సూచనలు జారీ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 61 ఫిర్యాదులందినట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదులిలా...
ఏకంగా లే అవుట్ నే మాయం చేశారంటూ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లోని డైమండ్ హిల్స్ కాలనీ ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 9 ఎకరాల విస్తీర్ణంలో 70 రెసిడెన్షియల్ ప్లాట్లతో ఉన్న లే అవుట్ ను మొత్తం చెరిపేసి, తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. 2024లో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పునిచ్చినా, వారిని ఖాళీ చేయించలేకపోతున్నామని వాపోయారు. లే అవుట్ లోని రహదారులు, పార్కులు లేకుండా పోయాయని ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలో జాతీయ రహదారితో పాటు ఓఆర్ ఆర్ ను కలుపుతూ కండ్లకోయ, దేవరయాంజల్ మధ్య ఉన్న40 అడుగుల రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మించి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. హయత్‌నగర్ అనుమగల్‌లోని తిరుమల హౌసింగ్ కాలనీలోని 2955 గజాల జీహెచ్ ఎంసీ పార్కును కొంత మంది వ్యక్తులు కబ్జా చేశారు.
Also Read: Cyber Criminals Arrest: సైబర్ కేటుగాళ్లకు బ్యాండ్ బాజా.. రూ.4.37 కోట్లు వెనక్కి!
ఈ పార్కు అభివృద్ధికి రూ. 1.20 కోట్లతో అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు కూడా కబ్జా దారులకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా వదలడంలేదని పలువురు నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట కార్పోరేషన్ పరిధిలోని తుర్కచెరువులోని ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌తో పాటు, అక్కడున్న ప్రభుత్వస్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని వెంటనే ఆపాలని హైడ్రాకు పిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు