Hyderabad Crime: ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యనే భర్త హతమార్చిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. భార్య అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నిందితుడు.. అందుకు అడ్డుగా ఉన్న భార్యను అడ్డుతొలగించుకున్నాడు. అయితే గుండెపోటుతో భార్య చనిపోయిందని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో అసలు విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితికి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్ అనే వ్యక్తితో వివాహమైంది. పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేసే అనిల్.. భార్యతో హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కొద్దికాలం పాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలోనే సాహితి అక్క వారి జీవితంలోకి వచ్చింది.
అక్కతో వివాహేతర బంధం
ఈ క్రమంలో సాహితి అక్కపై కన్నేసిన అనిల్.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఆమెను బెదిరించి వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంతో భార్య సాహితితో అనిల్ కు తరచూ గొడవలు సైతం జరిగేవని సమాచారం. దీంతో అడ్డొచ్చిన చెల్లిని సైతం హింసించేవాడని తెలుస్తోంది. పద్దతి మార్చుకోవాలని కుటుంబ సభ్యుల సమక్షంలో హెచ్చిరించినా నిందితుడు మారలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
భార్యపై దాడి..
అక్కతో వివాహేతర సంబంధంపై మరోమారు అనిల్, సాహితి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. సాహితిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో దెబ్బలు తాళలేక సాహితి ప్రాణాలు కోల్పోయింది. అయితే గుండె పోటుతో తన భార్య చనిపోయిందని అనిల్.. సాహితి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హైదరాబాద్ కు వచ్చిన సాహితి కుటుంబ సభ్యులు.. ఒంటిపై గాయాలను గమనించారు.
Also Read: CM Revanth Reddy: పరువు తీయోద్దు.. మనం ఒకే ఫ్యామిలీ.. సీఎం రిక్వెస్ట్
పరారీలో భర్త
సాహితి శరీరంపై దెబ్బలు ఉండటంతో భర్త అనిల్ ను ఆమె కుటుంబ సభ్యులు నిలదీశారు. ఏం చేశావని గట్టిగా ప్రశ్నించారు. దీంతో భయపడిపోయిన అనిల్.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనకు సంబంధించి సాహితి కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.