Miss World 2025: ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వాములు అవుతున్న మిస్ వరల్డ్ – 2025 (Miss World 2025) గ్రూప్ -2 పోటీదారులు.. మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టి పడనుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో పోచంపల్లి వస్త్రాలకు గిరాకీ ఏర్పడే అవకాశముందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన ఈ పోచంపల్లి గ్రామం ఉంది. ఎంతో సంక్లిష్టమైన ఇక్కత్ నేత పద్ధతికి పోచంపల్లి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. పోచంపల్లిని యునెస్కో ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా సైతం గుర్తించడం విశేషం. ఇక్కడి చేతి వృత్తులు, సంస్కృతి మన వారసత్వానికి సజీవ మ్యూజియంగా చెబుతుంటారు.
మే 15న పోచంపల్లి వెళ్లనున్న మిస్ వరల్డ్ పోటీదారులు.. అక్కడి ఇక్కత్ నేత పద్దతిని స్వయంగా పరిశీలిస్తారు. టై-అండ్-డై ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు… నిష్ణాతులైన నేత కార్మికులతో సంభాషించనున్నారు. హైదరాబాద్ నిజాంలు ఒకప్పుడు అభిమానించిన డబుల్ ఇకాట్ కళాఖండమైన ఐకానిక్ టెలియా రుమల్ తయారీని సైతం వారు వీక్షించనున్నారు.
Also Read: CM Revanth Reddy: రెండ్రోజుల్లో మిస్ వరల్డ్ పోటీలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనతో ప్రపంచ మీడియా దృష్టి పోచంపల్లిపై పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఈవెంట్ తో తెలంగాణ గొప్ప చేనేత వారసత్వం ప్రపంచ పటంలో సుస్థిరంగా నిలుస్తుందని అభిప్రాయపడుతోంది. పోచంపల్లి శక్తివంతమైన నేత పని, గ్రామీణ హస్తకళ, సాంస్కృతిక వైభవం, ఇక్కడి ప్రజల జీవన విధానం ప్రపంచం చర్చించుకునేందుకు శక్తివంతమైన వేదికగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతుంది.