CM Revanth Reddy: తెలంగాణలోని ఉద్యోగ సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, నిరసనలు చేస్తామన్న ఉద్యోగ సంఘాల నేతలకు కీలక సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామని పిలుపునిచ్చారు. మనం ఇక్కడ సమరం చేయడానికి లేమన్న సీఎం.. ప్రజలకు సేవచేయడానికే ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు.
పరువు తీయవద్దు
బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు కానీ, ఎక్కడా అప్పు పుట్టడంలేదని అన్నారు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారమని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబమన్న రేవంత్ రెడ్డి.. ఫ్యామిలీ పరువును బజారున పడేయవద్దని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ కుట్రలో పావులు కావొద్దు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందన్న సీఎం.. నన్ను కోసినా ఆదాయానికి మించి ఏమి చేయలేనని పేర్కొన్నారు. తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దని హితవు పలికారు. తనతో అందరూ కలిసి రావాలన్న సీఎం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేద్దామని సూచించారు.
ప్రభుత్వంపై సమరం ఎందుకు?
ఉద్యోగ సంఘాలు ఎందుకు సమరానికి పిలుపునిస్తున్నాయో చెప్పాలని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అని ప్రశ్నించారు. ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉందని తెలియజేశారు. గత పాలకులు రూ.8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ గత ప్రభుత్వం చెల్లించకుండా మిగిలిపోయినవేనని రేవంత్ స్పష్టం చేశారు.
Also Read: Miss World 2025: ప్రపంచ పటంపై పోచంపల్లి.. అతిథులుగా మిస్ వరల్డ్ భామలు!
అండగా నిలవండి
కేవలం పదహారు నెలల్లో రూ. 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు.. బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి.. ప్రాజెక్టులు కట్టామని చెప్పి కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్లిపోయిందని రేవంత్ తెలిపారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అనడాన్ని సీఎం తప్పు పట్టారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలదేనని చెప్పారు.