Street Lights In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ పై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది. గతంలో 57 ప్యాకేజీలుగా ప్రైవేటు కాంట్రాక్టర్లకు నిర్వహణ బాధ్యత అప్పగించగా, అనేక లోపాలు తలెత్తటంతో ఈ బాధ్యతను ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్(ఈఈఎస్ఎల్ )కు అయిదేళ్లు క్రితం జీహెచ్ఎంసీ అప్పగించింది. గడిచిన అయిదేళ్లలో ఈఈఎస్ఎల్ సంస్థ కూడా ఆశించిన స్థాయిలో మెరుగైన నిర్వహణను అందించలేకపోవటం, కనీసం స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి ప్రజాప్రతినిధుల ఫిర్యాదులను పట్టించుకోకపోవటంతో పలుసార్లు కౌన్సిల్ సమావేశంలో దుమారం రేగింది.
కనీసం స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ కు సంబంధించి లైట్లు, ఇతర పరికరాల బఫర్ స్టాక్ కూడా ఈఈఎస్ఎల్ మెయింటెన్ చేయకపోవటంతో వెలగని వీధి ధీపాలకు జీహెచ్ఎంసీ అధికారులు వరుసగా జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. పని తీరు మార్చుకోకపోవటంతో అధికారులు వరుసగా ఇప్పటి వరకు సుమారు కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించారు. బిల్లులు సక్రమంగా చెల్లించటం లేదని ఈఈఎస్ఎల్ సంస్థ చెబుతుండగా, ఒప్పందం ప్రకారం మరమ్మతుల బఫర్ స్టాక్ కూడా మెయింటేన్ చేయటం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
పలుసార్లు కమిషనర్, మేయర్లు సైతం సమీక్షలు నిర్వహించి, మరమ్మతులకు సంబంధించి ఖచ్చితంగా బఫర్ స్టాక్ మెయింటేన్ చేయాల్సిందేనని తేల్చి చెప్పినా, ఈఈఎస్ఎల్ సంస్థ పని తీరు మారలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల 40 వేల వరకు స్ట్రీట్ లైట్లున్నాయి.
వీటి నిర్వహణకు సంబంధించిన అధికారులకు తరుచూ ఫిర్యాదులు వస్తుండటం, ఈఈఎస్ఎల్ సంస్థ మరమ్మతులకు సంబంధించి బఫర్ స్టాక్ మెయింటేన్ చేయకపోవటం, మరో వైపు ప్రజాప్రతినిధుల నుంచి మరమ్మతుకు వత్తిడి పెరగటంతో ఇటీవలే జీహెచ్ఎంసీ నేరుగా వీధి దీపాలు కొనుగోలు చేసి, పలు ప్రాంతాల్లో అమర్చిన దాఖలాలుండటంతో ఈఈఎస్ఎల్ నుంచి స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ ను తప్పించాలని అధికారులు భావిస్తున్నారు.
మీళ్లీ గతంలో మాధిరిగానే ప్రైవేటు కాంట్రాక్టర్లకు టెండర్ల ద్వారా నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగో ఈ నెలాఖరుతో ఈఈఎస్ఎల్ ఒప్పందం గడువు ముగిస్తుండటంతో తాజాగా టెండర్ల ప్రక్రియ చేపట్టి, మెరుగైన మెయింటనెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెట్టి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని బల్దియా భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Local body election Results: కౌంటింగ్ స్టార్ట్… ఫలితం ఇప్పటికే బయటపడ్డట్లే!
వారం రోజుల్లో కీలక నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ లోని 30 సర్కిళ్లలోని స్ట్రీట్ లైట్లకు సంబంధించి మరో వారం రోజుల్లో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు స్ట్రీట్ లైట్ల నిర్వహణ మరింత మెరుగుగా చేపట్టేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్న సమయంలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం నోటిఫికేషన్ రావటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది.
ఈ నెలాఖరు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున, ఆ తర్వాత జరిగే స్టాండింగ్ కమిటీలో ఈఈఎస్ఎల్ ను కొనసాగించాలా? లేక మళ్లీ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలా? అన్న విషయంపై కమిటీ నిర్ణయాన్ని తీసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అంతలోపు స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ లో ఎలాంటి లోపాలు తలెత్తుకుండా ఉండేందుకు గాను టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు దాదాపు నెలరోజుల పాటు ఈఈఎస్ ఎల్ ను కొనసాగించి, ఆ తర్వాత బాధ్యతను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే స్ట్రీట్ లైట్లు, స్తంభాలను గుర్తించేందుకు ఓ సర్వేను కూడా నిర్వహించారు. స్ట్రీట్ లైట్లు, పోల్స్ ను జియోట్యాగింగ్ చేసి, వెలిగే లైట్లకే బిల్లు చెల్లించేలా సరి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. సరి కొత్త విధానానికి సంబంధించి చేసుకునే ఒప్పందాన్ని అయిదేళ్లు గడువు నుంచి రెండేళ్లకు కుదించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు