మంథని స్వేచ్చః Minister Sridhar Babu: పేదల సంక్షేమమే ఏజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని ప్రాంతంలో పర్యటించిన శ్రీధర్ బాబు పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఎక్లాస్ పూర్ నుంచి ఖమ్మం పల్లి, రహదారి పునరుద్ధరణ ఖమ్మం పల్లి- ఓడేడు, మంథని నుంచి ఓడేడు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు.
అట్టడుగు వర్గాలలో జన్మించి ప్రపంచ మేధావిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎదిగారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతమన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ విడుదల చేస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.
నాణ్యతా లోపం లేకుండా రహదారి పనులు
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలన్నారు. ఒకసారి రోడ్డు వేస్తే 15 యేళ్ల దాకా సమస్య రావద్దని మంత్రి సూచించారు. బగుళ్ల గుట్టలో రూ.2 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్ లైన్ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు.
మంథని పట్టణంలో రూ. కోటి వ్యయంతో అన్ని హంగులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి. ఎస్ఈ కిషన్ రావు,ఈఈ భావ్ సింగ్ , ఆర్డీవో సురేష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read: SC Classification GO: గుడ్ న్యూస్.. జీవో వచ్చేసిందోచ్.. ఇక వారికి పండగే!