New Ration cards: కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్టు తయారైంది కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం. కార్డుల్లో పేర్లు యాడ్ చేయడం కోసం.. కొత్త కార్డుల కోసం.. తప్పులు సరిచేయడం కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం తప్పుల తడకగా మారిపోయింది.
తప్పులు సరిచేయమంటే కొత్త తప్పులు చేశారని.. పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ అధికారుల తీరుతో అభాసుపాలైయ్యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల జారీలో అధికారుల లీలలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం..
కొత్త తప్పులు
బీఆర్ఎస్ హయాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్న పేరు పోయింది. అనేకమంది పేదలు రేషన్ బియ్యానికి దూరమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది.
రేషన్‌కార్డుల్లో తప్పుల సవరణలు, మార్పులు చేర్పులు, పేర్ల తొలగింపు కొత్త పేర్లు కలపడం, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధిదారులను ఆందోళనకు గురి చేశారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులు చూసి అవాక్కయ్యారు.
Also Read: Hyderabad Crime:ఫైనాన్స్ ట్రిక్ అంటూ ఘరానా మోసం.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్..
అధికారుల నిర్లక్ష్యం
కార్డుల జాబితా చూస్తే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతున్నది. గ్రామసభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి ధరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. రేషన్ కార్డులో పేరు నమోదులో అనేక అక్షర దోషాలు కనబడుతున్నాయి. దరఖాస్తు పెట్టిన చోట కాకుండా మరోచోట రేషన్ కార్డులో పేర్లు రావడం తో లబ్ధిదారులు అయోమయానికి లోనవుతున్నారు.
కొత్తగా పెళ్లయిన జంట రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే భర్త పేరు అత్తగారి ఇంటి రేషన్ కార్డులో పేర్లు నమోదు చేశారు. భర్త అడ్రస్ గల్లంతు అయి అత్తగారింటి అడ్రస్‌లో పేరు కనపడుతున్నది. భార్య పేరు ఇటు తల్లిగారి ఇంట్లో లేదు అటు అత్తగారి ఇంట్లో పేరు లేకుండా గల్లంతైంది. తల్లిదండ్రులతోపాటు వారి పిల్లల పేర్లు కొత్తగా చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆ పేర్లు వారి రేషన్‌కార్డులో కాకుండా నానమ్మ లేదా అమ్మమ్మల రేషన్ కార్డులో జత చేశారు. మళ్లీ వారి రేషన్ కార్డు నుండి పేర్లు తొలగించి కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్‌కార్డు వస్తుందో రాదో తెలియని అయోమయంలో పడ్డారు.
అధికారులు చేసిన తప్పులను సరి చేసుకునేందుకు బాధితులు తహసీల్దార్ కార్యాలయాలతోపాటుగా ‘మీసేవ’ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని మొదటి నుండి ఆన్‌లైన్ ఎంట్రీలో సరైన చర్యలు చేపడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజా పాలన గ్రామసభల్లో చదివిన పేర్లు తాజాగా తుది జాబితాలో లేకపోవడం గమనార్హం.
అంత్యోదయకార్డు తీసేశారు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక శాంతమ్మ అనే నిరుపేద మహిళలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు ఉండేది. ఆమె కొడుకు పెళ్లి చేసుకుని వేరుపడ్డాడు. కాగా తన పేరును కార్డు నుంచి తొలగించాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే కొడుకు పేరు తియ్యడానికి బదులు మొత్తం కార్డు తీసేశారు. ఇప్పుడు వారికి నెలకు 35 కిలోల బియ్యం వచ్చే అత్యోదయ కార్డు పోయింది.
తెల్ల రేషన్ కార్డు లేకుండా పోయింది. అధికారులు చేసిన తప్పుకు బలి అయిన ఆ కుటుంబం మూడు నెలలుగా బియ్యం దిక్కులేక రోదిస్తున్నారు. కార్డు పునరుద్ధరించాలని తహశీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు.
Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?
పిల్లల పేర్లు చేర్చమంటే అత్తగారి కార్డులో చేర్చారు
మా పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నారు. అయినా వారి పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి ఇప్పటివరకు అవకాశం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు చేర్చడానికి అవకాశం కల్పించింది. మా భార్యాభర్తలతోపాటు మా పిల్లల పేర్లు యాడ్ చేయాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా. ప్రజాపాలన గ్రామసభలోనూ దరఖాస్తు చేసుకున్నాను.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబితా ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే భార్య పేరు గల్లంతయింది. మా పిల్లల పేర్లు వేరే గ్రామంలోని మా అత్తగారికి చెందిన రేషన్ కార్డులో చేర్చారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పేవారు లేరు. ప్రభుత్వం స్పందించి వెంటనే సరి చేసి మాకు బియ్యం వచ్చేలా చెయ్యాలి.
– మురహరి ప్రశాంత్, బాధితుడు
Also RKTR on Fine Rice scheme: నై నై అన్న కేటీఆర్.. సై సై అని చేసి చూపిన సీఎం రేవంత్..
పేరు తొలగించమంటే ఉన్నకార్డు తీసేశారు
నాకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా కుటుంబం నుంచి నేను వేరు పడ్డాను. నాకు కొత్త రేషన్ కార్డు కావాలంటే మా పాత కార్డు నుంచి నా పేరు తొలగించాలని అధికారులు చెబితే నా పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాను. నా పేరు తొలగించడానికి బదులు అధికారులు మాకు రేషన్ కార్డే లేకుండా చేశారు. పాత కార్డు డిలీట్ చేసి కొత్త కార్డు కూడ ఇవ్వలేదు.
ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన రేషన్ కార్డు పునరుద్ధరించలేదు. ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పాత కార్డును పునరుద్ధరించడంతో పాటు నాకు సపరేట్ రేషన్ కార్డు మంజూరు చేయాలి.
– శ్రావణ్, బాధితుడు
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు