CS Shanti Kumari: సీఎస్ శాంతికుమారికి(CS Shanti Kumari) ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పోస్ట్ దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆమెకు ఆ పదవి దక్కేపరిస్థితి కనిపించడం లేదు. ఆమె పదవీకాలం కూడా పెంచడం లేదని తెలుస్తున్నది. ఈ మేరకు సచివాలయ అధికారుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆమెకు కొత్త పదవి వచ్చే అవకాశం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారి (CS Shanti Kumari).. 2023 జనవరి 11న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె పదవీకాలం ముగియనున్నది.
పదవీకాలం పొడిగించాలని.. లేదంటే కొత్త పదవి ఇవ్వాలని ఆమె ప్రపోజల్ పెట్టుకున్నట్టు సమాచారం. ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా ప్రభుత్వం ఆమెకు బాధ్యతలు అప్పగించబోతున్నదని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె వీఆర్‌ఎస్ తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు ఏ పదవి ఇవ్వడం లేదని తాజాగా సీఎంవో వర్గాల నుంచి సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో శాంతికుమారి చేసేదేమీ లేక పదవీవిరమణ చేయబోతున్నట్టు సమాచారం.
Also Read: TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!
కారణం ఇదేనా?
సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari)కి పదవీకాలం పొడిగింపు, కొత్త పదవి కేటాయింపుపై ప్రభుత్వం వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. క్యాబినెట్( Cabinet) మంత్రులు, పొలిటికల్ వర్గాలు, ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆమె ఏపీకి చెందిన అధికారి కావడంతో ప్రయారిటీ ఇవ్వకపోవడమే మంచిదని మెజార్టీ అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం.
గత ప్రభుత్వంలో సీఎస్‌గా నియామకమైన తర్వాత.. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆమెను పదవీకాలం పూర్తయ్యే వరకు కంటిన్యూ చేశామని.. ఇదే కాంగ్రెస్( Congress) ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన మంచి అవకాశం అంటూ క్యాబినెట్ మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిసింది. కొత్త అధికారికి సీఎస్‌గా అవకాశం ఇస్తే మంచిదని మెజార్టీ మంత్రులు వివరించారట. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రికే వదిలేసినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్‌గా మారింది.
ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం పైరవీలు!
ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రస్తుత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎంకు సన్నిహితంగా ఉండే సీనియర్ అధికారి కావడంతో పక్కాగా ఆయనకే సీఎస్ పోస్టు వరిస్తుందని కొందరు అధికారులు చెప్తున్నారు. పైగా సీనియారిటీ జాబితాలోనూ ఆయనే ఉన్నట్టు తెలుస్తున్నది.
దీంతోపాటు మరి కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రామకృష్ణారావుకే పదవి దక్కబోతున్నదని సమాచారం. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఐసీసీ స్థాయిలోనూ ఈ పోస్ట్ కోసం పైరవీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కానీ సీఎం, డిప్యూటీ సీఎం రామకృష్ణరావు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు