Hanuman Jayanti 2025: ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా SP అశోక్ కుమార్ ,జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత గారితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుండి జయంతి కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో 10వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11 వ తేదీ రాత్రి నుండి 13 వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో 64 సి. సి. కెమెరాలు ఉండగా అదనంగా 50 సి. సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.
Also read: Food safety department: కల్తీ ఆహారంపై సర్కార్ సీరియస్.. పుడ్ సేఫ్టీకి కొత్త టార్గెట్స్!
అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్. టి. సి. బస్సులను పెంచాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు. చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని, కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలు ఉన్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు.
కేశఖండనకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద ఎక్కువ మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని, అధికారులకు సూచించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్ట్ ల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/