SRH: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మెయిల్ వార్ కొనసాగుతోంది. ఫ్రీ పాస్ ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒత్తిడి తెస్తోందని.. ఇలా చేస్తే హైదరాబాద్ విడిచి పెట్టి వెళ్ళిపోతామంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ చేసిన హెచ్చరికపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంతే ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఓ మెయిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ కు పంపించింది. దాంట్లో కోటాకు మించి అదనంగా పాస్ లు ఇవ్వాలని ఎప్పడూ అడగలేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించటం మంచి పద్దతి కాదని పేర్కొంది. కొన్ని సమస్యలు ఉన్నా ఐపీఎల్ మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహించాలని మౌనంగా ఉంటున్నామని పేర్కొంది. తమ కార్యవర్గ సభ్యులపట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ ఉద్యోగ బృందంలోని కొందరు అనుచితంగా వ్యవహరిస్తున్న తీరు వల్లే సమస్యలు వస్తున్నాయంది. ఇప్పటికైనా ఈ మెయిళ్లకు స్వస్తి చెప్పి కూర్చని మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.
Also Read: BRS Silver jubilee: ఆ ఒక్క సభపైనే ఆశలు? పడరాని పాట్లు పడుతున్న బీఆర్ఎస్?
ఇప్పటివరకు ఉప్పల్ లో జరిగిన రెండు మ్యాచ్ లకు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కేవలం 3,800 కాంప్లిమెంటరీ పాస్ లే అని తెలిపింది. అవి కూడా కోశాధికారి శ్రీనివాస్ కు ఇచ్చారుగానీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు కాదని పేర్కొంది. ఎఫ్ 12ఏ బాక్సులో సామర్థ్యానికి మించి 50 టిక్కెట్లు ఇస్తామని సన్ రైజర్స్ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. అయితే, కేవలం 30మంది కూర్చోవటానికి మాత్రమే వీలుండటంతో మిగిలిన 20 పాస్ లను మరో బాక్స్ లో సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలియచేసింది.
గతనెల 27న సన్ రైజర్స్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ సురేశ్ దీనికి అంగీకరించినట్టు పేర్కొంది. నిజానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి శ్రీనివాస్ తో జరిగిన సమావేశంలో శ్రీనాథ్ పాల్గొనలేదని తెలిపింది. అలాంటపుడు ఆయన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. తాము పంపిస్తున్న వాట్సాప్ మెసెజీలు, ఈ మెయిళ్లకు సన్ రైజర్స్ ప్రతినిధులు స్పందించటం లేదని తెలిపింది.
ఇక, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రతీ మ్యాచ్ కు 10శాతం టిక్కెట్లు బ్లాక్ చేయమన్నారన్నది కూడా నిజం కాదని పేర్కొంది. ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం 10శాతం టిక్కెట్లు బ్లాక్ చేయాలని అడగలేదని స్పష్టం చేసింది. తమ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాస్ లు సరిపోక పోతుండటంతో డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనటానికి అవకాశమివ్వాలని అపెక్స్ కౌన్సిల్ గతనెల 19న కోరిన విషయాన్నిగుర్తు చేసింది. దీనికి సన్ రైజర్స్ యాజమాన్యం అంగీకరించి హెచ్సీఏ అకౌంట్ నుంచి చెల్లింపులు జరపమని అడిగినట్టు తెలిపింది. దీనికి తాము అంగీకరించలేదని పేర్కొంది.
Also Read: Gorantla Madhav on TDP: పరిటాల ఫ్యామిలీపై గోరంట్ల ఫైర్.. హంతకులంటూ సంచలన ఆరోపణలు
టిక్కెట్లు కొన్నవారు వ్యక్తిగతంగా డబ్బు చెల్లిస్తారని స్పష్టంగా చెప్పినట్టు తెలిపింది. ఈ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం పెండింగ్ లో ఉండగానే జగన్మోహన్ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం 2,500 టిక్కెట్లు బ్లాక్ చేయాలని అడిగినట్టు దురుద్దేశాలు ఆపాదించటం సమంజసం కాదని పేర్కొంది. స్టేడియం ఆధునీకరణ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ సీట్లు వేయించాలని జస్టిస్ నాగేశ్వరరావుని సన్ రైజర్స్ యాజమాన్యం కోరిందని పేర్కొంది. దీని కోసం అయ్యే 8 నుంచి 10కోట్ల ఖర్చును సీఎస్ఆర్ నిధుల కింద చెల్లిస్తామని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, సన్ రైజర్స్ యాజమాన్యం ఈ మాటను నిలబెట్టుకోలేదని పేర్కొంది.
ఈ క్రమంలోనే స్టేడియంలో తాజా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని సన్ నెట్ వర్క్ ఎండీకి లేఖ కూడా రాశామని తెలియచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి స్టేడియానికి రంగులు వేయటం, కార్పోరేట్ బాక్సుల ఆధునీకరణ పనులు మీరు చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు, వాటిని ఏర్పాటు చేయించటం తాము చేసినట్టుగా హెచ్సీఏ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన రాద్ధాంతాన్ని పక్కనబెట్టి సమస్యల పరిష్కారానికి చర్చలు చేయటానికి ముందుకు రావాలని కోరింది.