Gorantla Madhav on TDP: వైసీపీ నాయకుడు గొరుంట్ల మాధవ్ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ టీడీపీ గూండాలు, రౌడీలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
గొరుంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రాగిరి మండలంలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో 10 ఎంపీటీసీ స్థానాల్లో 9 స్థానాలను వైసీపీ గెలుచుకుందని, అయినప్పటికీ టీడీపీ ఈ ఎన్నికల ఫలితాలను ఒప్పుకోకుండా, మండల అధ్యక్ష పదవిని తమ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఈ ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో, పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుమ లింగమయ్య అనే వ్యక్తిపై అతని కుమారులు మనోహర్, శ్రీనివాస్‌లపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ దాడిలో సునితమ్మ అనే వ్యక్తి సొంత బంధువు, తమ్ముడితో పాటు 5-10 మంది గుండాలు రాడ్లు, కొడవళ్లతో దాడి చేసి లింగమయ్య తలపై తీవ్రంగా గాయపరిచారని, దీంతో ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఇదే క్రమంలో, నెల రోజుల క్రితం కనగానపల్లిలో చాకలి నర్సింహులు, ఆనందరెడ్డిలపై హత్యాయత్నం జరిగిందని, వారు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. అలాగే, ఆత్మకూరు సమీపంలోని సిద్దరాంపురంలో కురువ బాలన్నపై దుర్మార్గంగా దాడి చేసి చంపే ప్రయత్నం జరిగిందని, ఇటీవల ఎంపీటీసీ మండల అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, కురువ నాగిరెడ్డిలపై కూడా హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఈ హింసాత్మక ఘటనలన్నీ టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ఈ దాడులు చేస్తున్నారని గొరుంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చేందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తే, సునితమ్మ, ఆమె కుమారుడు ఆ డ్యామును రక్తంతో నింపాలని చూస్తున్నారని విమర్శించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఇక దంచుడే.. దంచుడు.. వర్షాలపై బిగ్ అప్ డేట్..
ఈ దాడుల్లో బాధితులపైనే కేసులు నమోదు చేస్తూ, నేరస్థులకు పోలీసు వ్యవస్థ సహకరిస్తోందని, బాధితులపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి అని అన్నారు.
టీడీపీ నాయకుడు శ్రీరామ్ మరో రక్త చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు తిరుగుబాటు చేస్తారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తారని గొరుంట్ల మాధవ్ హెచ్చరించారు. వైసీపీ ఈ దాడులను గట్టిగా ఎదుర్కొంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు సాగుతుందని, టీడీపీ బెదిరింపులకు భయపడబోదని ఆయన స్పష్టం చేశారు.
గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందిన నేపథ్యంలో, ఆ గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. అయితే, భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా హౌస్ అరెస్టు చేశారు. ఈ చర్యలపై గోరంట్ల మాధవ్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన టోల్ రుసుములు.. ఎంతంటే?
“వైసీపీ కార్యకర్త చనిపోతే, కనీసం పరామర్శ చేసేందుకు కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణం” అని గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి, దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని ఆయన విమర్శించారు. “ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను, నాయకులను ఇలా బంధించడం ద్వారా ప్రభుత్వం తన నియంతృత్వ ధోరణిని చాటుకుంటోంది” అని ఆయన ఆరోపించారు.
నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో వైసీపీ కార్యకర్త మృతి చెందడంతో పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఆ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆంక్షలు విధించారు. దీంతో ఆయన పోలీసులతో వాదనకు దిగారు. “మా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు. పైగా, మమ్మల్ని ఇళ్లలోనే బంధించడం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.