తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : GHMC Property Tax: రాష్ట్రంలో అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రూ.1700 కోట్లు దాటింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2024-25)కి లక్ష్యంగా పెట్టుకున్న రూ.2 వేల కోట్లలో బుధవారం నాటికి రూ.1708 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) తో పోల్చితే రూ. వంద కోట్లు అదనంగా వసూలు చేసినట్లు ట్యాక్స్ వింగ్ అధికారులు చెబుతున్నారు. కానీ లక్ష్యంగా పెట్టుకున్న రూ.2 వేల కోట్ల దాటింంచాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులు, ట్యాక్స్ ఫీల్టు లెవెల్ స్టాఫ్ కు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
లక్ష్యాన్ని చేరుకునేందుకు కేవలం మరో అయిదు రోజుల గడువు మాత్రమే ఉండటంతో అదనపు కమిషనర్, చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్ లు ఎప్పటికపుడు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం కమిషనర్ ఇలంబర్తి అదనపు కమిషనర్ ( ఫైనాన్స్), అదనపు కమిషనర్ ( రెవెన్యూ)లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ట్యాక్స్ కలెక్షన్ పెంచేందుకు పలు సూచనలు, సలహాలిస్తున్నట్లు తెలిసింది.
మొండి బకాయిలకు సంబంధించి నేరుగా జోనల్ కమిషనర్లు సంప్రదింపులు జరపాలని, చెల్లించని పక్షంలో ప్రాపర్టీ సీజ్ చేయాలన్న ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రాపర్టీ సీజింగ్ ప్రక్రియ మంచి ఫలితాలనిస్తుండటంతో చివరి మూడు రోజుల అన్ని సర్కిళ్లలో ఇదే విషయంపై స్పెషల్ డైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు వీలుగా సర్కారు ఈ నెల 7వ తేదీన అమల్లోకి తెచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్(ఓటీఎస్) తో అధికారులు ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కానుందున రొటీన్ ట్యాక్స్ కలెక్షన్ పై దృష్టి సారించారు. ఇప్పటి వరకు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే వసూలైనట్లు అధికారులు తెలిపారు.
Also ReaD: Hyderabad MMTs Incident: నాతో తప్పుగా ప్రవర్తించింది వాడే.. ఎంఎంటీఎస్ ఘటనలో కీలక మలుపు
సర్కిళ్లలో మూడంచెల టార్గెట్లు
జీహెచ్ఎంసీ చరిత్రలో వర్తమాన ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను రూ.2 వేల కోట్లు దాటించాలన్న సంకల్పంతో ఉన్న కమిషనర్ నెల రోజుల క్రితం ఒక్కో సర్కిల్ కు ఇచ్చిన మూడంచెల టార్గెట్ల ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుందా? లేదా? అన్న విషయంపై రహస్యంగా నివేదికలను తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఒక్కో సర్కిల్ పరిధిలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్ స్థాయిలో టార్గెట్లు విధించారు. సర్కిల్ కు బాస్ అయిన డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా విభాగాధిపతులతో సంప్రదింపులు జరిపి, ట్యాక్స్ కలెక్షన్ చేయాలని ఆదేశించారు.
Also Read: TG Govt on LRS: ప్లాట్ యజమానులకు గుడ్ న్యూస్..ఈ అవకాశం మీకోసమే
ట్యాక్స్ స్టాఫ్ కు పండుగ సెలవుల్లేవ్
వర్తమాన ఆర్థిక సంవత్సరం చివరి నెల కావటంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ట్యాక్స్, రెవెన్యూ ఉద్యోగులకు సాధారణ సెలవులతో పాటు ఫెస్టివల్ హాలీడేస్ ను కూడా రద్దు చేస్తూ ఇటీవలే సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ నెల 30వ తేదీన రంజాన్, మరుసటి రోజైన 31న ఉగాది పండుగల రోజుల కూడా ట్యాక్స్, రెవెన్యూ సిబ్బంది ట్యాక్స్ కలెక్షన్ విధులు నిర్వహించనున్నారు. ఈ ఏటా లక్ష్యంగా పెట్టుకున్న రూ. 2 వేల కోట్లలో ఇప్పటి వరకు రూ.1708 కోట్లు వసూలు కాగా, లక్ష్యానికి ఇంకా మిగిలి ఉన్న రూ. 292 కోట్లను మిగిలిన ఉన్న అయిదు రోజుల గడువుకు 30 సర్కిల్లకు ప్రత్యేకంగా టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీంతో ట్యాక్స్ , రెవెన్యూ సిబ్బంది పండుగల రోజులైన 30, 31న కూడా ఫీల్టులెవెల్ ట్యాక్స్ కలెక్షన్ చేయనున్నారు. ట్యాక్స్ కలెక్షన్ కు సిబ్బంది ఫీల్టు లెవెల్ కి వెళ్తుందా? లేదా? అన్న విషయాన్ని కమిషనర్ నేరుగా సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో ఆరా తీస్తున్నట్లు సమాచారం.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈలింక్ https://epaper.swetchadaily.com/క్లిక్ చేయగలరు