తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Trading Fraud Hyderabad: ట్రేడింగ్ ఫ్రాడ్ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు థాయ్ లాండ్ లో ఉన్న సైబర్ క్రిమినల్ తో కలిసి దేశవ్యాప్తంగా మొత్తం 23 నేరాలకు పాల్పడినట్టుగా వెల్లడైంది. జనం నుంచి 6 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టుగా తేలింది. సైబర్ క్రైం డీసీపీ డీ.కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన అంకిత్ అరోరా (38) ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉంటూ సైబర్ నేరాలు చేస్తున్న దీపక్ కుమార్ తో అతనికి పాత పరిచయం ఉంది.
Also Read; Illegal Lottery Tickets Sale: సీఎం సొంత జిల్లాల్లో అక్రమ లాటరీ దందా.. కుదేలవుతున్న బాధితులు
ఈ క్రమంలో దీపక్ కుమార్ కొంతకాలం క్రితం అంకిత్ అరోరాతో మాట్లాడి తనకు బ్యాంక్ అకౌంట్లను సమకూర్చి పెట్టాల్సిందిగా అడిగాడు. తాను చేస్తున్న సైబర్ మోసాల గురించి కూడా చెప్పాడు. తన ఉచ్ఛులో చిక్కిన వారితో ఆ అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయిస్తానని తెలిపాడు. ఆ తరువాత తాను తీసుకుంటానన్నాడు. ఈ పని చేసి పెడితే పెద్ద మొత్తాల్లో కమీషన్ ఇస్తానన్నాడు. దాంతో అకౌంట్లు సమకూర్చి పెట్టటానికి అంకిత్ అరోరా అంగీకరించాడు. తన పేరన వేర్వేరు బ్యాంకుల్లో మూడు ఖాతాలను తెరిచి వాటికి సంబంధించిన ఆన్ లైన్ బ్యాంకింగ్ తోపాటు అన్ని వివరాలు అన్నింటినీ దీపక్ కుమార్ కు తెలియచేశారు.
Also Read; Delimitation JAC meeting:హైదరాబాద్‌లో రెండో సదస్సు.. రానున్న దక్షిణాది సీఎంలు!
ఇదిలా ఉండగా దాదాపు ఆరు నెలల క్రితం దీపక్ కుమార్ సికింద్రాబాద్ లో ఉంటున్న ఓ వ్యక్తికి టెలిగ్రాం యాప్ ద్వారా ఓ మెసెజ్ పంపించాడు. దాంట్లో తాను ఇచ్చిన సలహాల మేరకు ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు సంపాదించ వచ్చని పేర్కొన్నాడు. దాంతో బాధితుడు డబ్బు వస్తుంది కదా అని ఆశ పడి కొంత డబ్బును పెట్లుబడిగా పెట్టాడు. దీనికి దీపక్ కొంత మొత్తాన్ని లాభంగా పంపించాడు. బాధితుడు తనను పూర్తిగా నమ్మాడని నిర్ధారించుకున్న తరువాత దీపక్ కుమార్ తాను కొన్ని ట్రేడింగ్ అప్లికేషన్లను పంపిస్తానని, వాటిల్లో పెట్టుబడులు పెడితే ఇంకా ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పాడు.
Also Read: Panjagutta Police Station: ఈ పోలీస్ స్టేషన్ ఒక సంచలనం.. హైదరాబాద్ లో ఇదే హైలెట్..
బాధితుడు మొత్తం కోటీ 22లక్షల 87వేల రూపాయలను దీపక్ కుమార్ చెప్పిన మేరకు అంకిత్ అరోరాకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాడు. ఆ తరువాత ఈ డబ్బును థాయ్ లాండ్ లో ఉన్న దీపక్ కుమార్ తన అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. కాగా, పెట్టుబడులు పెట్టిన బాధితునికి ఆన్ లైన్ ద్వారా లాభాలు వచ్చినట్టుగా అతని పేర క్రియేట్ చేసిన వాలెట్ లో చూపించిన దీపక్ కుమార్ ఆ నగదును డ్రా చేయటానికి వీల్లేగుండా చేశాడు. అదే విషయాన్ని బాధితుడు అడుగగా వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన దీపక్ కుమార్ మరికొంత నగదును తాను చెప్పిన ఖాతాల్లో వేయమన్నాడు. లేనిపక్షంలో మరోసారి తనను సంప్రదించవద్దని చెప్పాడు. అప్పుడు జరిగింది మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: CM Revanth Reddy: ఇది రేవంత్ సర్కార్.. ప్రతీ నిర్ణయం ఓ సంచలనమే!
ఈ మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం సీఐ కే.ప్రసాదరావు, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ పీ.వీ.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సతీష్, శ్రీనివాస్ రెడ్డి, క్రాంతి, రాకేశ్, శేఖర్, వెంకటేశ్ లతో కలిసి నిందితుల్లో ఒకడైన అంకిత్ అరోరాను అరెస్ట్ చేశారు. అతని నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు, ఓ పాస్ బుక్కు, వేర్వేరు అకౌంట్లకు చెందిన 11 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దీపక్ కుమార్ పై ఎల్వోసీ జారీ చేయించి ఇక్కడకు రప్పించటానికి చర్యలు తీసుకుంటున్నట్టు డీసీపీ కవిత తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు