తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hydra Update: గ్రేటర్ పరిధిలోని చెరువుల అభివృద్ది, పునరుజ్జీవనానికి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సీఎస్ఆర్) కింద సహకరించేందుకు ముందుకు రావాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఆహ్వానం పలికారు. గ్రేటర్ తో పాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. చెరువుల సుందరీకరణకే పరిమితం కాకుండా, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సంస్థలకు సూచించారు.
చెరువుల అభివృద్ధికి సీఎస్ ఆర్ నిధులు వెచ్చిస్తున్న, వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ బు ధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జీహెచ్ ఎంసీ లేక్స్ విభాగం అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సీఎస్ ఆర్ వింగ్ డైరెక్టర్ అర్చనా సురేష్‌తో పాటు హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీ,ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హాజరైన ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ మాధాపూర్‌లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్నుద్దీన్ దౌలా చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ఔటర్ రింగురోడ్డు పరిధిలో 1025 చెరువులుండగా,ఇందులో 61 శాతం జాడ లేకుండా ఉన్నాయని, మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అందరం కళ్లు తెరిచి చెరువులను పరిరక్షించుకోకపోతే, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న విషయాన్ని ఇప్పటికైనా అందరూ గుర్తించాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.
Also read: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు
చెరువుల్లో పూడిక తీయడం, చెరువులోకి మురుగు రాకుండా కాలువలను డైవర్ట్ చేయడం, ఎస్‌టీపీల ఏర్పాటుతో మంచినీటి చెరువులను తయారు చేయడం అందరూ లక్ష్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెరువు అభివృద్ధితో ఆయా సంస్థలకు మంచిపేరు రావాలనేదే హైడ్రా ప్రయత్నమని, అక్కడ కొంత భూమిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంటుందన్నారు. చెరువులు అభివృద్ధి చేస్తున్న సంస్థలకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న, ఎదురయ్యే ఇబ్బందులను కమిషనర్ అడిగి తెల్సుకున్నారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారణ, ఆక్రమణల తొలగింపు, మురుగు కాలువలను మళ్లించటం,అనుమతుల కోసం వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఇబ్బందిగా మారాయని పలు సంస్థల ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మీకు కావల్సిన వివిధ రకాల అనుమతులన్నీ సింగిల్ విండో మాదిరిగా మంజూరయ్యేలా చూస్తామని, మీరు పూర్తిస్థాయిలో చెరువులను తీర్చిదిద్దాలని ప్రతినిధులను కమిషనర్ కోరారు. మురుగు కాలువల మళ్లింపు , ఎస్టీపీల ఏర్పాటు,వరుసగా 5 ఏళ్లు నిర్వహణకు బాధ్యతలు నిర్వర్తించాలన్నారు.
Also read:CM Revanth Reddy: తెలంగాణ బాటలో యావత్ దేశం.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్ కదూ
చెరువుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరేలా కూడా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.పెద్దచెరువుల అభివృద్ధికి నాలుగైదు సంస్థలు కలసి ముందుకు రావాలని , అప్పుడు నిధుల ఇబ్బందులుండవని సూచించారు. ఐటీ కారిడార్‌లోనే కాకుండా, నగరం నలువైపులా ఉన్న చెరువుల అభివృద్ధికి సంస్థలు ముందుకు రావాలని కమిషనర్ కోరారు. చెరువుల బఫర్‌జోన్ లో జులై 2024 కి ముందు నిర్మించి నివాసాలుంటున్న కట్టడాలతో పాటు, అనుమతులు పొందిన నిర్మాణాలను తొలగించబోమని, అక్కడ వాణిజ్య కార్యక్రమాల కోసం నిర్మించిన కమర్షియల్ ఆక్రమణలను తొలగిస్తామని కమిషనర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్ ఆర్ ఎస్‌సీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డులతో పాటు,విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా ఎఫ్‌టీఎల్ నిర్ధారణ కూడా మే నెల నాటికి పూర్తవుతుందని, దీన్ని ఎంతో పారదర్శకంగా చేస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.