తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: McDonald’s In Telangana: తెలంగాణ ప్రభుత్వంతో అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు బుధవారం ప్రకటించింది. 2వేల మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది.
అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మెక్‌డొనాల్డ్స్ సంస్థ గ్లోబల్ ఆఫీస్ ముందుకు రావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందన్నారు.
Also read: Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు.. పని లేదన్నాడు.. అంతా దోచేశాడు
ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. సంస్థకు ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు.
మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు. దీంతో హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు వెల్లడించారు.
Also read: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు
ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్ లెట్లున్నాయని, ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా ఉన్నారు.