Warangal Police: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భారీ మోసానికి పాల్పడి, ఏకంగా రూ. 2 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన ముఠాలోని 13 మంది నిందితులను వరంగల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఐకేపీ సిబ్బందితో పాటు మిగతా నిందితుల నుంచి పోలీసులు రూ. 1,07,84,134 విలువైన నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా డీసీపీ అంకిత్ కుమార్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Also Read: Warangal Police Commissioner: సైబర్ నేరగాళ్లకు చుక్కలే.. సీపీ సీరియస్..
రైతులు లేరు.. భూమి లేదు ధాన్యం లేదు
2025 రబీ పంట సీజన్ సమయంలో శాయంపేట, కాట్రపల్లిలోని ఐకేపీ కేంద్రాలలో ఈ అక్రమాలు జరిగినట్లు డీసీపీ తెలిపారు. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ అక్రమాలను ఛేదించారు. ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్, ఐకేపీ ఇన్‌చార్జ్ బండ లలిత, ట్యాబ్ ఆపరేటర్ చరణ్ సింగ్తో కుమ్మక్కయ్యాడు. వీరు కలిసి నకిలీ రైతుల పేర్లతో 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిలో వరి పంట పండించినట్లు తప్పుడు వివరాలు నమోదు చేశారు. టోకెన్ బుక్స్ నకిలీగా వ్రాసి, మండల ఏఈవో, ఏవో లాగిన్ ఐడీల ద్వారా తప్పుడు ఎంట్రీలు చేశారు. ఈ మోసంలో.. ఒక్కో క్వింటాకు లలిత, చరణ్ సింగ్‌కు రూ. 120 చొప్పున కమిషన్, శ్రీనివాస్‌కు రూ. 500 బోనస్, రూ. 50 మిల్లింగ్ ఛార్జ్ వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా మొత్తం 314 ఎకరాలకు 9,100 క్వింటాళ్లపై రూ. 2.10 కోట్ల విలువైన నిధులు అక్రమంగా పొందారు. నకిలీ రైతులుగా చూపించిన 12 మంది అకౌంట్లలో రూ. 1.86 కోట్లు, మిగతా ముగ్గురి అకౌంట్లలో రూ. 24 లక్షలు జమ అయ్యాయి.
అక్రమ నిధుల మళ్లింపు
ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్ దొంగిలించిన డబ్బును తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అందులో భాగంగా రూ. 32 లక్షలు వెచ్చించి కమలాపూర్ మండలం, పంగిడిపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమిని తన కుమారుల పేర్లపై కొనుగోలు చేశాడు. రూ. 8 లక్షలు ఖర్చు చేసి టాటా నెక్సాన్ కారు కొన్నాడు. రూ. 1.06 కోట్లు ఖర్చు చేసి గత సీజన్, ప్రస్తుత సీజన్ షార్టేజ్ ధాన్యం కొనుగోలు చేశాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుల బ్యాంక్ అకౌంట్లలోని రూ. 54 లక్షలను ఫ్రీజ్ చేశారు. అదనంగా, రూ. 9.50 లక్షల నగదు, రూ. 32 లక్షల విలువైన భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో మొత్తం రూ. 1,07,84,134 విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన 13 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: Gadwal Police: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకే హత్య!
