Gadwal District: సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుతున్నాయి. పౌరుడు ఏదైనా ప్రభుత్వ శాఖలో అవినీతి జరిగిందని తెలుసుకోవడానికి, తనకు కావాల్సిన సమాచారం అధికారుల నుంచి పొందేందుకు చట్టపరంగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మరి కొందరు అధికారులు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రభుత్వ శాఖల్లో సమాచారం ప్రతీ పౌరుడు తెలుసుకోవాలని ఏర్పాటు చేసిన చట్టం ఆచరణలో నిర్వీర్యమవుతోంది.
సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆదేశించినా..
రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ జిల్లాలో పర్యటించి సమాచారం అందించాలని జిల్లా అధికారుల సమీక్ష సమావేశాలలో ఆదేశాలు జారీ చేసినా బేఖాతారు చేయడం గమనార్హం. అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని సమాచార హక్కు చట్టం దరఖాస్తు దారులు వాపోతున్నారు. దీనికి నిత్యం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేటిదొడ్డి(Ketidhodi) మండలంలో ఉపాధి హామి పథకం (అదనపు కార్యక్రమ అధికారి- ఎన్ఆర్ఈజీఎస్) మాత్రం పౌర సమాచార అధికారి నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి 2020 నుంచి 2025 సంవత్సరం వరకు కేటిదొడ్డి గ్రామంలో ఉపాధి హామీ పథకం కిందా చేసిన పండ్ల తోటల సాగు వివరాలు, నిర్వాహణ బిల్లు, లబ్దిదారుల వివరాలు, బిల్లుల చెల్లింపు, తదితర వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఆగస్టు నెలలో దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించి 30 రోజుల్లో దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వవలసిన కేటిదొడ్డి ఎన్ఆర్ఈజీఎస్ అధికారి ఉద్దేశపూర్వకంగా సెప్టెంబర్ 15న పేపర్‌కు మూడు రూపాయలు చొప్పున 470 పేజీలకు సుమారు 1456 రూపాయలు కట్టాలంటూ తిరిగి లేఖ పంపినట్లు తెలుస్తోంది.
Also Read: Kantara 1 collection: మొదటి రోజు ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్ ఎంతంటే?
బాధితుడు అడిగిన సమాచారం..
సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరైనా సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకుంటే వారికి 30 రోజుల్లోగా సమాధానం అందించాల్సి ఉంటుంది. కానీ జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేటిదొడ్డి(Ketidhoddi) ఎంపీడిఓ(MPDO) కార్యాలయంలో రెండు నెలలు గడుస్తున్న ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ కాలం గడుపుతున్నారు. బాధితుడు అడిగిన సమాచారం ఇవ్వకపోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారాన్ని రెండు నెలలు గడుస్తున్న ఎందుకు ఇవ్వలేదు అంటూ బాధితుడు ప్రశ్నిస్తున్నారు. ఆ సమాచారంలో ఎన్ని లోటుపాట్లు ఉంటే ఆ సమాచారం ఇవ్వడం లేదు అని అనుమాన పడుతున్నారు. బాధితుడు వెళ్లి సంబంధిత అధికారులను అడగగా పొంతనలేని సమాధానం ఇస్తున్నారు. ఆర్టీఐ(RTI) యాక్టు కింద సమాచారం కోరడంతో ఉపాధి కూలీలకు, ఇతర బిల్లులు చెల్లించేందుకు అడ్డొస్తున్నట్లు తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీఐ ఆర్జీదారుడు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ(MPDO), ఏపీఓ(APO) సిబ్బందిపై చర్యలు తీసుకుని దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
Also Read: Mahabubabad District: చిన్నపిల్లల వ్యాక్సిన్ లపై సిబ్బంది నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు
