Mahabubabad District: మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ లపై వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల కాలనీలో స్పెషల్ డ్రైవ్ కింద వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ మరి నిర్లక్ష్యంగా సాగుతోంది. వ్యాక్సిన్ ల కొరత ఉందంటూ సెంటర్ల నుంచి చిన్నపిల్లలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. రాకపోకలు సాగించలేక పేరెంట్స్ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే పేరెంట్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. అంగన్వాడి సెంటర్ల వారీగా వ్యాక్సిన్లను వేయాల్సిన సిబ్బంది పేరెంట్స్ పై దురుసుగా ప్రవర్తిస్తూ వ్యాక్సిన్ల ప్రక్రియలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటు చిన్నపిల్లలకు సరైన సమయంలో వ్యాక్సిన్లు వేయించలేక, అదేవిధంగా ప్రయాణాల భారం కూడా పడుతుంది. అనుకున్న సమయానికి వ్యాక్సిన్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినప్పటికీ అక్కడ సరైన వ్యాక్సిన్లు లేవని సిబ్బంది చెప్పడంతో పేరెంట్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్(Ravi Rathod) సైతం స్పందించకపోవడం గమనార్హం.
వాక్సిన్లపై ప్రత్యేక జాగ్రత్తలు
మహబూబాబాద్ జిల్లా లో చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం పై జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చిన్న పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించే విధంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. శనివారం మహబూబాబాద్ పట్టణంలోని మంగళ్ కాలనీలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్(Special drive) వాక్సిన్డ్ల కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు చిన్నపిల్లల పేరెంట్స్ పై దురుసుగా ప్రవర్తిస్తూ అసహనానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమైనా మాకు ఉద్యోగాలు ఇస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో దసరా వేడుకలు.. ఆయుధపూజలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్
తూతూ మంత్రంగా వ్యాక్సిన్‌ల పంపిణీ..
జిల్లావ్యాప్తంగా చిన్న పిల్లలకు వేసే వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ తూతూ మంత్రంగానే సాగుతుందని పేరెంట్స్ పెదవి విరుస్తున్నారు. ఓవైపు సిబ్బంది నిర్లక్ష్యంతో, మరోవైపు వ్యాక్సిన్లు సకాలంలో అందకపోవడంతో చిన్న పిల్లలకు టీకా వేయించలేకపోతున్నారు. ప్రభుత్వం వైద్యంపై పటిష్ట ప్రణాళిక రక్షిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్నారు. నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు సమకూర్చినప్పటికీ అక్కడ వైద్యాన్ని అందించడంలో మాత్రం వైద్యులు విఫలమవుతున్నారు. నిరుపేదలంటే చులకనగా చూస్తూ ఇబ్బందులను కలిగిస్తున్నారు. వైద్యం చేయించుకోవాలంటే ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఎదురవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి చిన్నపిల్లల వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకొని కిందిస్థాయి సిబ్బంది, వైద్యశాఖ ఉద్యోగులకు తగిన జాగ్రత్తలతో సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Kantara 1 collection: రెండో రోజు కూడా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్లు.. ఎంతంటే?

