Gajwel News: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మరింత విస్తరించి జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణంగా ఖ్యాతి గడించనుంది. తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోగా మున్సిపాలిటీ విస్తరణలో కూడా మిగతా పట్టణాలకు దీటుగా మారింది. గత 12 సంవత్సరాల క్రితం 30 వేల జనాభాతో ఉన్న గజ్వేల్(Gajwel) పట్టణం ఇప్పుడు 80వేల జనాభాతో ప్రధాన పట్టణంగా మారునుంది. పట్టణ శివారులో నిర్మించిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనంతో పట్టణ విస్తరణ మరింత పెరగనుంది. ముంపుకు ముందు ఎంపికైన ఆయా గ్రామాల పంచాయతీల పాలకవర్గాలు పని చేయగా ఈసారి మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే అనేక సమస్యలతో ఉన్న ముంపు గ్రామాల కాలనీలు మున్సిపాలిటీలో విలీనం చేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందని ముంపు గ్రామాల ప్రజలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనం అయితేనే కాలనీల అభివృద్ధికి మరింత అవకాశాలు మెరుగుపడుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో గజ్వేల్ ముందుకు..
మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినప్పటి నుండి గజ్వేల్(Gajwel) పట్టణం కొత్త అంగులను సంతరించుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గజ్వేల్ పట్టణ అభివృద్ధికి అనేక విధాల కృషి చేశారు. నిధుల కేటాయింపు తో పాటు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా అన్ని రంగాలలో అభివృద్ధిలో గజ్వేల్ ముందుకు దూసుకు వెళ్ళింది. అయితే 2013లో ప్రజ్ఞాపూర్, ముట్రాజ్ పల్లి, క్యాసారం గ్రామపంచాయతీ లతో పాటు వాటి పరిధిలోని సంగాపూర్(Sangapur), రాజిరెడ్డిపల్లి(Rajireddy Pally), గుండన్నపల్లి(Gundanna Pally), సంగుపల్లి(Sangupally) గ్రామాలను విలీనం చేయడం జరిగింది.
Also Read: KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో దసరా వేడుకలు.. ఆయుధపూజలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్
30 వేల జనాభా 22 వేల ఓటర్లతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గా ఏర్పడింది. కెసిఆర్(KCR) కృషితో విద్య ,వైద్యం, వ్యాపారం, రోడ్డు రవాణా, టూరిజం తదితరంగాలలో అభివృద్ధి చెందడంతో పట్టణ జనాభా కూడా బాగా పెరిగింది. గజ్వేల్ పట్టణ అభివృద్ధిని మరో 20 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించి అమలు చేశారు. సౌకర్యాలు అందిపుచ్చుకొని వివిధ రంగాలలో రాష్ట్రంలోని పలు పట్టణాలకు దీటుగా గజ్వేల్ మారింది. పట్టణ జనాభా 50 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఎర్రవల్లి, సింగారం, పల్లెపహాడ్, వేముల ఘాట్, బంజరు బ్రాహ్మణపల్లి, లక్ష్మాపూర్, రాంపూర్, కిష్టాపూర్ తదితర గ్రామాలను విలనం జరిగితే 80 వేల జనాభా, 50 వేల వరకు ఓటర్ల సంఖ్య పెరగనున్నట్లు అంచనా. అలాగే 32 వార్డ్ ల వరకు ఏర్పాటు కానట్లు తెలుస్తుంది.
సమస్యలతో సతమతం
ముంపు గ్రామాల కాలనీలో అనేక సమస్యలు ప్రజలను నిత్యం వేధిస్తున్నాయి. నిధుల కొరతతో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉండగా, స్మశాన వాటికలు, ప్లేగ్రౌండ్ లు లాంటి సమస్యలు ఉన్నాయి. అనేకమందికి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ప్యాకేజీలు, ఇతర బెనిఫిట్ లు అందలేదని ఆందోళన లు ఉన్నాయి. ముఖ్యంగా కాలనీవాసులకు సొంత వ్యవసాయ భూములు సమీపంలో లేకపోగా ఇతర వ్యాపారాలు కూడా లేకపోవడంతో ఉపాధి బాగా ఇబ్బందిగా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాలే 99 శాతం ఉండడంతో వారి కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. స్థానికంగా నివాసం ఉండడం తప్ప ఎలాంటి పనులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటికి తోడు మున్సిపల్ పన్నుల భారం కూడా తమపై పెరుగుతుందేమో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతుంది.
అంచనాలు తారుమారు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాజకీయం ముంపు గ్రామాల విలీనంతో తారు మారు కానుంది. పట్టణంలో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ పాలకవర్గాలు ఏర్పాటు కాగా ముచ్చటగా మూడోసారి ఏ పార్టీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటుతుందనే చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్య కాకుండా బిజెపి(BJP) కూడా మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటనున్నట్లు తెలుస్తుంది. ముంపు గ్రామాల లో సైతం ఈ మూడు పార్టీలకు ప్రజల మద్దతు లభించనున్నట్లు స్పష్టమవుతుంది. 8 నుండి 10 వరకు ముంపు గ్రామాల వార్డుల కౌన్సిలర్లు ఎంపిక కానుండగా వీరి పాత్ర కూడా మున్సిపల్ పాలకవర్గంలో కీలకంగా మారానున్నట్లు తెలుస్తుంది.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?
