Sir Creek Area: దాయాది దేశం పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దసరా పండుగ రోజు సంచలన వార్నింగ్ ఇచ్చారు. ‘సర్ క్రీక్ ప్రాంతం’ (Sir Creek Area) విషయంలో ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడినా పాకిస్థాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మార్చివేసే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. గుజరాత్‌లోని సరిహద్దు నగరమైన భుజ్‌లో ఉన్న సైనిక స్థావరంలో జవాన్లతో కలిసి ఆయన దసరా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ కూడా చేశారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘లాహోర్ వరకు వెళ్లగల శక్తిసామర్థ్యం భారత సైన్యానికి ఉందని 1965 యుద్ధంలో చాటిచెప్పాం. 2025లో పాకిస్థాన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కరాచీకి చేరుకునే ఒక మార్గం క్రీక్ నుంచి వెళ్లుతుంది’’ అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also- Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!
78 ఏళ్లైనా వివాదాస్పదమే!
‘‘స్వాతంత్య్రం లభించిన 78 సంవత్సరాలు గడిచినప్పటికీ, సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పాకిస్థాన్ ఉద్దేశాలు స్పష్టంగా లేకపోవడమే కాక లోపభూయిష్టంగా ఉన్నాయి. సర్ క్రీక్ సమీప ప్రాంతాల్లో ఇటీవల పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలను విస్తరించిన తీరు, వారి అసలైన ఉద్దేశాలను బయటపెడుతోంది. భారత సరిహద్దులను ఇండియన్ ఆర్మీ, సరిహద్దు భద్రతా దళం (BSF) అప్రమత్తంగా ఉండి రక్షిస్తున్నాయి’’ అని రాజ్‌సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదంపై (cross-border terrorism) భారత్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ రక్షణ వ్యవస్థలోకి చొరబడేందుకు, లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు భారత రక్షణ వ్యవస్థను చీల్చేందుకు పాకిస్థాన్ విఫల ప్రయత్నం చేసింది. అయితే, భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా బహిర్గతం చేసింది. భారత సైన్యం ఎప్పుడైనా, ఎక్కడైనా పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం కలిగించగలదనే సంకేతాన్ని ప్రపంచానికి భారత్ పంపింది’’ అని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యాలను సైన్యం విజయవంతంగా సాధించిందని పునరుద్ఘాటించారు. అయితే, పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలన్న ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.
Read Also- Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు.. వారి కాంబోలో ఇది రెండో చిత్రం
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం యుద్ధాన్ని ప్రారంభించడం కాదని, ఇది ఉగ్రవాదంపై భారత్ చర్య అని వివరించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం విజయవంతంగా తమ అన్ని సైనిక లక్ష్యాలను సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. పాకిస్థాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.
ఏంటీ సర్ క్రీక్ ప్రాంతం?
వివాదాస్పద ప్రాంతమైన సర్ క్రీక్ అంశంపై రాజనాథ్ సింగ్ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్ క్రీక్ ప్రాంతం గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, పాకిస్థాన్ మధ్య ఉంటుంది. 96 కిలోమీటర్ల పొడవు ఉండి నదీ ప్రాంతాన్ని, సముద్రాన్ని కలుపుతుంది. సముద్ర సరిహద్దు విషయంలో ఎవరికి అనుకూలంగా వారు అంచనాలు వేస్తుండడంతో ఇరుదేశాల మధ్య వివాదస్పద ప్రాంతంగా ఉంది.