Huzurabad Farmers: హుజురాబాద్ ప్రాంత రైతులను యూరియా కొరత సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. యూరియా కోసం రైతులు,(Farmers) ముఖ్యంగా మహిళలు, కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. యూరియా బస్తాల కోసం మాత్రమే కాకుండా, వాటిని పొందేందుకు అవసరమైన టోకెన్ల కోసం కూడా రైతులు తెల్లవారుజాము నుంచే సింగిల్ విండో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జమ్మికుంట రోడ్డులోని హుజురాబాద్ సింగిల్ విండో కార్యాలయం వద్ద సుమారు వెయ్యి మంది రైతులు క్యూ లైన్లలో నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఒక్కో రైతుకు ఒక బస్తా కోసం ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. దీనికోసం ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఐదుగురు చొప్పున రైతులను లోపలికి పంపి, బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: ఏడాదిలో 10,006 మంది టీచర్ల నియామకం.. విద్యాశాఖకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట
రైతన్నల గోడు
గత రెండు రోజుల క్రితం కూడా హుజురాబాద్ ఏడీఏ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి, ఏవో భూమిరెడ్డిని ఘెరావ్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సింగిల్ విండోలు, ప్రైవేటు ఫర్టిలైజర్లు యూరియాను బ్లాక్ చేసి, దానిని 20-20 పొటాషియం వంటి ఇతర ఎరువులతో కలిపి అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు. దీనిపై అధికారులు రెండు రోజుల్లో యూరియాను అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా వేయవలసిన సమయం కావడంతో రైతులు ఈ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా(Urea) కష్టాలు ఇలాగే కొనసాగితే, పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CM New Helicopter: చంద్రబాబుకు కొత్త హెలికాఫ్టర్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు!