TG High Court: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో కొంతకాలం క్రితం జరిగిన పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రకటించినట్టుగా కోటి రూపాయల నష్ట పరిహారం ఎప్పుడు ఇస్తారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిగాచీ కంపెనీ ప్రమాదంలో 54 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
Also Read: TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఈసీని ప్రశ్నించిన హైకోర్టు!
ప్రమాదంపై నిపుణుల కమిటీ
ఈ ఘటనపై బాబూరావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని, అలాగే బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని కూడా ఇవ్వలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ వాదనలు వినిపిస్తూ, ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను విశ్లేషిస్తున్నామని చెప్పారు.
నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే పోలీసులు తదుపరి చర్యలు
పోలీసులు 192 మంది ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరించారని, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సైతం ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా, బాధితులకు కోటి రూపాయల నష్ట పరిహారం ఎప్పుడు ఇస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.25 లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా డబ్బు ఇప్పించేలా చూస్తున్నామని వివరణ ఇచ్చారు. దీంతో, తదుపరి విచారణను వాయిదా వేసిన హైకోర్టు, రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: TG Police Corruption: చట్టం ఉన్నోళ్లకు చుట్టమా.. నీటి మీద రాతలుగా పోలీస్ బాస్‌ల ఆదేశాలు
