TG Police Corruption: పలుకుబడి, పరపతి ఉన్నవారికి చట్టాలు చుట్టాలవుతున్నాయి. ఫిర్యాదులపై నిష్పక్ష విచారణ జరపాలంటూ పోలీస్ బాస్‌లు చెబుతున్న మాటలు నీటి మీద రాతలవుతున్నాయి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ చేస్తున్న హెచ్చరికలను కూడా కొందరు కిందిస్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చిన్నాచితక నేరాలు చేసిన వారిని అరెస్టులు చేసి హడావుడి చేస్తున్న వీళ్లు పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చట్టాలను తుంగలో తొక్కుతున్న వారిని మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. కోర్టుల ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వివాదాస్పద స్థలాల్లో కూల్చివేతలు జరిపిస్తున్న వారిని విడిచి పెట్టేస్తున్నారు. కోర్టుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తున్నా నెలల తరబడి విచారణను పెండింగ్‌లోనే పెడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తరచూ ఈ తరహా ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
డాక్టర్ మోసం కేసు
నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్(Dr. Nori Lakshmi Bhaskar) ఉదంతాన్ని పరిశీలిస్తే, తనతోపాటు వైద్య విద్య చదివిన డాక్టర్ వీట్ల శ్రీరాములు(DR. Veetla Sriramulu)కు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్ ఇప్పిస్తానని నమ్మించి 50 లక్షల రూపాయలు తీసుకుని నిలువునా ముంచాడు. దీనిపై శ్రీరాములు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు మొదట కేసులు నమోదు చేయలేదు. దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి విచారణ జరపాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడంతో తప్పనిసరై బీఎన్ఎస్ 316(2), 316(5), 318(1), 318(4), 336(1), 336(3), 338, 175(3) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఇవి రిజిస్టర్ చేసి రోజులు గడిచినా పోలీసులు లక్ష్మీభాస్కర్‌పై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈలోపు అతను తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రస్తుతం ఇది విచారణలో ఉన్నది. దీనిపై బంజారాహిల్స్ పోలీసులతో మాట్లాడగా విచారణ జరుగుతున్నది అని మాత్రమే చెబుతున్నారు. లక్ష్మీభాస్కర్ తనకున్న పరిచయాలను ఉపయోగిస్తూ పోలీసులు అరెస్ట్ చేయకుండా మేనేజ్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: Hydra: గోషామహల్ నియోజకవర్గంలో.. రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
ఆరా మస్తాన్ కబ్జా అంశంలోనూ అంతే..
మెట్టుగూడ సర్వే నెంబర్ 733లోని 5,717 గజాల స్థలానికి సంబంధించి చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. 60 ఏళ్లుగా తన పొజిషన్‌లో ఉన్న భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆరా మస్తాన్ ఆక్రమించే యత్నం చేస్తున్నట్టుగా రమేశ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని కూడా జత చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇక, వేర్వేరు పార్టీలకు చెందిన బడా నేతలతో సన్నిహిత పరిచయాలు ఉన్న ఆరా మస్తాన్ వాటి సహాయంతో జోన్‌కు చెందిన ఓ పెద్ద అధికారిని మేనేజ్ చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద స్థలంలో రమేశ్ తరఫున వాచ్ మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి కుటుంబాన్ని ఆరా మస్తాన్ మనుషులు బెదిరించి వెళ్లగొట్టారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీనిపై రమేశ్ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. దాంతో బాధితుడు రమేశ్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆరా మస్తాన్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు చెప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆరా మస్తాన్ మనుషులు జేసీబీతో వచ్చి వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేశారు. దీంట్లో కూడా భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఈసీని ప్రశ్నించిన హైకోర్టు!
దగ్గుబాటి హీరోలది మరో కథ
ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 1లోని దక్కన్ కిచెన్ హోటల్(Deccan Kitchen Hotel)కు సంబంధించి టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్(Venkatesh), రానా(Rana), అభిరామ్(Abiram), నిర్మాత సురేష్(Suresh), లీజ్ హోల్డర్ నందకుమార్ మధ్య చాలా రోజులుగా కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ అరెస్ట్ అయిన సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ కిచెన్ హోటల్ అక్రమ నిర్మాణమని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై హోటల్ డైరెక్టర్ హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ జరిపిన న్యాయస్థానం స్థలం యజమాని, లీజ్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) అధికారులను ఆదేశించింది. దాంట్లో వెల్లడయ్యే వివరాల మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే, 2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు పదుల సంఖ్యలో వచ్చిన బౌన్సర్లు హోటల్ కూల్చివేత పనులు చేపట్టారు.
వెంటనే నందకుమార్ భార్య, కుమారుడు అక్కడికి వెళ్లి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే హోటల్‌ను పాక్షికంగా కూల్చి వేశారు. 2024 జనవరిలో హోటల్‌ను పూర్తిగా కూల్చివేశారు. దీనిపై నందకుమార్ ఫిర్యాదు చేసినా ఫిలింనగర్ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. దాంతో ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఫిలింనగర్ పోలీసులు జనవరి 11న వెంకటేశ్, రానా, సురేష్, అభిరామ్లపై ఐపీసీ 448, 452, 458, రెడ్ విత్ 120 బీ ప్రకారం కేసులు నమోదు చేసింది. పది నెలలు గడిచినా కేసులో దర్యాప్తు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందాన ఉన్నది. పోలీసులతో దీని గురించి మాట్లాడితే విచారణ జరుపుతున్నామన్న సమాధానం వచ్చింది. ఇలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నా పోలీస్ బాసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం అంతర్గత విచారణ కూడా జరిపించడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. దాంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారికి అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
Also Read: Warangal District: బీసీల వాటా కోసం పిడికిలెత్తిన సకల జనులు.. గొంతెత్తిన సామాజిక సంస్థలు
