TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు (TG High Court) రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది సురేందర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కూడా. అయితే, రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
రీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు జరిపేలా ఆదేశాలు
వీటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టులో విచారణ నడుస్తున్నందున విచారణకు స్వీకరించలేమంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టి వేసింది. కావాలనుకుంటే పాత పద్దతిలో ఎన్నికలు జరుపుకోవచ్చని పేర్కొంది. కాగా, రీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అడ్వకేట్ సురేందర్ వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారాంటూ హైకోర్టు ఇటు ప్రభుత్వాన్ని అటు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ అడగటంతో దానికి అంగీకరించిన హైకోర్టు రెండు వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.
